పనికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మేస్త్రీ ..ఇంట్లోకి కోతులు రాకుండా తీగ అమర్చి విద్యుత్ కనెక్షన్

పనికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మేస్త్రీ ..ఇంట్లోకి కోతులు రాకుండా తీగ అమర్చి విద్యుత్ కనెక్షన్

 పనులు చేస్తూ.. తెలియక పట్టుకోవడంతో కరెంట్ షాక్  
ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 
ములుగు జిల్లాలోని జంగాలపల్లిలో ఘటన

ములుగు, వెలుగు: ఇంట్లోకి కోతులు వస్తున్నాయని గోడకు వైర్ అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో.. ఆ తీగ తగిలి మేస్త్రీ చనిపోయిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్​రావు, బాధిత కుటుం బ సభ్యులు తెలిపిన  ప్రకారం.. ములుగు మండలం ఇంచర్లకి చెందిన చింతల రవి (45) మేస్త్రీ పని చేస్తుంటారు. ఆయనకు భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లు ఉండగా పెండ్లిళ్లు చేశారు. 

అదే మండలంలోని జంగాలపల్లికి చెందిన బుర్ర సమ్మయ్యకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు  నిర్మాణ పనులను  మేస్త్రీ రవి చేస్తున్నాడు. కాగా.. సమ్మయ్య ఇంటి పక్కనే ఎండీ గౌస్​ తన ఇంట్లోకి కోతులు రాకుండా గోడ చుట్టూ ఇనుప తీగను అమర్చి విద్యుత్ కనెక్షన్​ ఇచ్చాడు. ఇది తెలియని రవి గురువారం పనులు చేస్తూ  పట్టుకోవడంతో కరెంట్ షాక్​ కొట్టి స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో గౌస్, నస్రీన్​దంపతులు, బుర్ర సమ్మయ్య, వనమాల దంపతులు, వీరి కొడుకులు రమేశ్, సురేశ్, నరేశ్​​ లపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకటేశ్వర్​ రావు తెలిపారు.