ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపిన కొడుకు

ఆస్తి కోసం భార్యతో కలిసి తల్లిని చంపిన కొడుకు

 

  • ఇల్లు అమ్ముకునేందుకు అడ్డుగా ఉందని దారుణం
  • హత్య చేసి, సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం
  • అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా డెడ్‌‌బాడీపై 
  • రక్తపు మరకలు గుర్తించిన బంధువులు
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఉప్పల్, వెలుగు:  ఆస్తి కోసం కన్న తల్లిని దారుణంగా చంపాడో కొడుకు. ఈ హత్యకు భార్య, మరో వ్యక్తి సహకరించారు. హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌లోని రామంతాపూర్‌‌‌‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామంతాపూర్‌‌‌‌లోని వెంకట్‌‌ రెడ్డి నగర్‌‌‌‌లో కాసవేని అనిల్‌‌ (40), అతని తల్లి సుగుణమ్మ, భార్య తిరుమల (35) నివాసం ఉంటున్నారు. అనిల్‌‌కు ఇద్దరు కొడుకులు కాగా, వారు హాస్టల్‌‌లో ఉంటూ చదువుకుంటున్నారు. అనిల్‌‌ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో అతని భార్య తిరుమలకు వారి ఇంటి సమీపంలో ఉన్న శివ (35)తో పరిచయం ఏర్పడింది. 

దీంతో వారిద్దరూ కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. సుగుణమ్మ భర్త కొన్నేండ్ల కింద చనిపోగా, వెంకట్‌ నగర్‌‌లో వీరు నివాసం ఉంటున్న ఇల్లు సుగుణమ్మ పేరుపై ఉంది. అయితే ఆ ఇంటిని తన పేరు మీద రాయాలని కోడలు తిరుమల.. సుగుణమ్మను వేధిస్తూ ఉండేది. ఆమె వేధింపులు ఎక్కువ కావడంతో సుగుణమ్మ ఈ విషయాన్ని కొడుకు అనిల్‌కు చెప్పినా స్పందించలేదు. దీంతో ఐదేండ్ల క్రితమే ఆ ఇంటిని బలవంతంగా తిరుమల తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. గత కొంత కాలంగా ఆ ఇంటిని అమ్మడానికి ఆమె ప్రయత్నిస్తుండగా, ఈ విషయం సుగుణమ్మకు తెలిసింది. ఆ ఇల్లు తన భర్త జ్ఞాపకం అని, తాను బతికి ఉన్నంత కాలం ఇంటిని అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 

తలపై దిండు అదిమిపెట్టి..

సుగుణమ్మను అడ్డు తొలగిస్తే తప్ప.. ఇంటిని అమ్ముకోలేనని తిరుమల భావించింది. ఈ విషయాన్ని భర్త అనిల్‌కు చెప్పడంతో ఇద్దరు కలిసి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తిరుమల ఫ్రెండ్‌ అయిన శివకు చెప్పింది. ముగ్గురు కలిసి ఈ నెల 4న అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుగుణమ్మ గాఢ నిద్రలో ఉండగా, ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, తలపై దిండును అదిమి పెట్టి చంపేశారు. తర్వాత తన తల్లి నిద్రలోనే చనిపోయిందని ఈ నెల 5న అనిల్‌ తన బంధువులకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఇల్లు అమ్మే విషయంలో కొడుకు, కోడలుతో గొడవలు జరుగుతున్నాయని, సుగుణమ్మ ఆమె తల్లికి ఫోన్‌ చేసి చెప్పేది. దీంతో తన కూతురిది సహజ మరణం కాదని, హత్య అని మృతురాలి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బంధువులు సుగుణమ్మ అంత్యక్రియలకు రాగా, ఆమె చెవుల నుంచి రక్తం కారిన గుర్తులు గమనించారు. సుగుణమ్మ తల్లి, బంధువులు అనిల్‌, తిరుమలను నిలదీయగా, తామే చంపామని నిజం ఒప్పుకున్నారు. ఇల్లు అమ్ముకునేందుకు అడ్డుగా ఉందనే కారణంతోనే ఇలా చేశామని చెప్పారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.