ముంబై ఎయిర్పోర్టులో రూ. 28.10 కోట్ల కొకైన్‌ స్వాధీనం

ముంబై ఎయిర్పోర్టులో రూ. 28.10 కోట్ల కొకైన్‌ స్వాధీనం

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ. 28.10 కోట్ల విలువైన 2.81 కిలోల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి ఇథియోపియా నుంచి భారత్‌ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. కాగా తనను ఓ మహిళ హనీ ట్రాప్ చేసి కొకైన్ స్మగ్లింగ్ చేయమని బలవంతం చేసిందని ఆ వ్యక్తి వెల్లడించారు. ముంబయికి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి సోషల్ మీడియాలో ఒక మహిళ పరిచయమైంది. అలా వారిద్దరూ స్నేహితులయ్యారు. అనంతరం ఆ మహిళ అతన్ని ఇథియోపియాకు రమ్మని చెప్పడంతో.. ఆ వ్యక్తి తాను చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం వదిలేసి మరీ ఆమెను కలవడానికి వెళ్లాడు.

అక్కడికి చేరుకోగానే ఆ మహిళను సంప్రదించేందుకు వ్యక్తి ప్రయత్నించగా.. తాను ముంబయిలోనే ఉన్నానని షాక్ ఇచ్చింది. అంతే కాదు అక్కడున్న కొందరు వ్యక్తులు ఆ వ్యక్తిని కొకైన్‌ ఉన్న బ్యాగ్‌ని తీసుకెళ్లమని బలవంతం చేశారు. ఆ సమయంలో అతనికి బ్యాగ్ తీసుకెళ్లడం తప్ప వేరే మార్గం లేక, ముంబయికి తీసుకురావల్సి వచ్చింది. అనంతరం కొకైన్ ను దాచిపెట్టిన బ్యాగును ఇంటెలిజెన్స్ నిఘా గుర్తించింది. మహిళ బ్లాక్ మెయిల్ తోనే తాను ఈ పని చేసినట్టు వ్యక్తి వెల్లడించారు. అధికారులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.