జీఎస్టీ వసూళ్లలో ఆల్-టైం హై రికార్డు

జీఎస్టీ వసూళ్లలో ఆల్-టైం హై రికార్డు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలకు గానూ రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 12 శాతం మేర వృద్ధి నమోదైంది. దేశంలో  జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఏప్రిల్‌ నెలలో రూ.1,87,035 కోట్లు వసూలుకాగా.. అందులో సీజీఎస్టీ కింద రూ.38,440 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.47,412 కోట్లు, రూ.89,158 కోట్ల మేర ఐజీఎస్టీ (రూ.34,972 కోట్ల దిగుమతైన వస్తువుల మీద), సెస్సు కింద రూ.12,025 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.18.10 లక్షల కోట్లు వసూలయ్యాయని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 22 శాతం అధికమని కేంద్రం తెలిపింది.

తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు కూడా స్వల్పంగా పెరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో రూ.4067 కోట్ల వసూళ్లు సాధించిన ఆంధ్రప్రదేశ్‌.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.4329 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 6 శాతం మేర పెరిగాయి. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.4,955 కోట్లు సాధించగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.5,622 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది.

రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు కావడం దేశ ఆర్థిక వ్యవస్థకు శుభవార్త అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. పీఐబీ ప్రకటనను ట్విట్టర్ లో కోట్‌ చేస్తూ తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ... ఈ స్థాయిలో పన్ను వసూళ్లు పెరగడం విజయానికి సంకేతంగా అభివర్ణించారు.