నాగార్జునసాగర్​లో వ్యక్తి హత్య

నాగార్జునసాగర్​లో వ్యక్తి హత్య
  • హిల్​కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న  షాపింగ్ కాంప్లెక్స్​లో ఇద్దరి గొడవ
  • చంపి అక్కడే పూడ్చి పరారైన నిందితుడు  

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం మర్డర్ ​జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని మెయిన్ బజార్​లో పర్వతనేని నాగేశ్వరరావు అలియాస్ పెద్దబాబు కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. ఈ నిర్మాణ పనుల్లో హిల్ కాలనీకి చెందిన రెహమాన్ (35) ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్నాడు. రాజమండ్రి నుంచి వచ్చిన శివ కూడా ఇదే షాపింగ్ కాంప్లెక్స్​లో రెండు రోజులుగా పెయింటింగ్ పనులు చేస్తున్నాడు.

శనివారం అర్ధరాత్రి రెహమాన్, శివ మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో రెహమాన్(35)ను శివ హత్య చేసి షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలోనే పూడ్చి పరారయ్యాడు. ఆదివారం షాపింగ్ కాంప్లెక్స్ లో రక్తపు మరకలు ఉండడం.. శివ, రెహమాన్ కన్పించకపోవడంతో షాపింగ్ కాంప్లెక్స్ యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసులు విచారణ జరిపి ఎవరో అక్కడ ఘర్షణ పడ్డారని నిర్ధారణకు వచ్చారు. సోమవారం కాంప్లెక్స్ కాంపౌండ్​లోకి వచ్చిన వాచ్ మెన్​కు దుర్వాసన రావడంతో పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చి పరిశీలించి..

అక్కడ ఓ గోతిని ఈ మధ్యే పూడ్చినట్టు గమనించారు. అక్కడ తవ్వగా రెహమాన్ ​డెడ్​బాడీ బయటపడింది. దీంతో పోస్ట్ మార్టం కోసం కమలా నెహ్రూ దవాఖానకు తరలించారు. కాగా, రెహమాన్​ కుటుంబసభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. భవన యజమాని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించడంతో ధర్నా విరమించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.