అడిషనల్​ కలెక్టర్​ను కొట్టిన దివ్యాంగుడు

అడిషనల్​ కలెక్టర్​ను కొట్టిన దివ్యాంగుడు
  • వనపర్తి జిల్లాలో ఆఫీసర్​ను కొట్టిన దివ్యాంగుడు
  • ప్రభుత్వం దగ్గర డబ్బులు సర్దుబాటు కావట్లేదన్న ఆఫీసర్​
  • మతిస్థిమితం లేకనే ఇలా చేశాడన్న తల్లిదండ్రులు
  • అరెస్ట్ చేసిన పోలీసులు...నల్లబ్యాడ్జీలతో అధికారుల నిరసన 

వనపర్తి, వెలుగు: వనపర్తి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తనకు పింఛన్​ రావడం లేదని దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన ఓ దివ్యాంగుడు అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ పై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న అధికారులు ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడికి నిరసనగా అధికారులు ప్రజావాణిని బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.  

జరిగింది ఇది...

వనపర్తి జిల్లా రాజనగరానికి చెందిన 30 ఏండ్ల సంద శివకుమార్ కాలు చచ్చుబడిపోవడంతో వికలాంగుల పింఛన్  తీసుకుంటున్నాడు. ఏప్రిల్​లో రావాల్సిన పింఛన్​ఇప్పటికీ రాలేదు. ఒంటరివాడైన ఆయనకు వేరే ఆధారం లేకపోవడంతో ఆవేదన చెందుతున్నాడు. తనకు ప్రతి నెల పింఛన్​ ఆలస్యంగా వస్తుందని, ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపాలంటూ ఇప్పటికీ మూడుసార్లు వనపర్తి కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకున్నాడు. సోమవారం కూడా మరో దరఖాస్తు రాసుకొని వచ్చాడు. అది చదివిన అడిషనల్​కలెక్టర్ వేణుగోపాల్ ఇందులో ఏముందని ప్రశ్నించాడు. దీంతో ఆవేశానికి లోనైన శివకుమార్ ..వేణుగోపాల్​చెంపపై కొట్టాడు. 

ప్రభుత్వం దగ్గర నిధులు సర్దుబాటు కాకనే.. 

శివకుమార్​పరిస్థితిని అర్థం చేసుకున్న అడిషనల్​కలెక్టర్​వేణుగోపాల్ అతడికి సమాధానం చెప్పాడు. ‘ఈ మధ్య ఫించన్ల చెల్లింపు ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం దగ్గర నిధులు సర్ధుబాటు కాకపోయినా ఏదో రకంగా పింఛన్ల డబ్బులు ఇస్తున్నాం’ అని చెప్పారు. తర్వాత దాడి విషయాన్ని అడిషనల్ కలెక్టర్ తో పాటు మరో అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సెలవులో ఉన్న కలెక్టర్ యాస్మీన్ బాషాకు చెప్పారు. ఆమె సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా శివకుమార్ పై వనపర్తి  రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్​చేశారు. దీనిపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధుకర్ మాట్లాడుతూ అధికారులకు రక్షణ కరువైందని భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.

మతి స్థిమితం లేదు  

మతిస్థిమితం లేకనే తమ కొడుకు అడిషనల్ కలెక్టర్ ను కొట్టాడని శివకుమార్ తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్​లో చూపించి మందులు కూడా వాడుతున్నట్లు చూపించారు. తమ కొడుకును వదిలేయాలని వేడుకున్నారు. పోలీసులు మాత్రం ఉన్నతాధికారుల సూచన  మేరకు రిమాండ్ చేసి జిల్లా జైలుకు తరలిస్తామని చెప్పారు. నిజంగానే మానసిక స్థితి సరిగ్గా లేదంటే ఎర్రగడ్డ దవాఖానాకు పంపిస్తామని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. దాడికి నిరసనగా జిల్లాలోని తహసీల్దార్లు,  మున్సిపల్ కమిషనర్లు,  ఆర్డీఓ, ఇతర  శాఖల అధికారులు నిరసనలు తెలిపారు.