అదేమన్నా బండా : మందు కొట్టిన పైలెట్.. పారిస్ లో విమానం నిలిపివేత

అదేమన్నా బండా : మందు కొట్టిన పైలెట్.. పారిస్ లో విమానం నిలిపివేత

మద్యం తాగి విమానంలోకి ఎక్కిన ఓ పైలట్ ను అరెస్ట్ చేశారు. దీంతో చివరి క్షణాల్లో విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగింది.

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం పారిస్‌ నుంచి వాషింగ్టన్‌ డీసీకి బయలుదేరుతున్న సమయంలో.. మద్యం తాగి ఉన్న పైలట్ విమానం ఎక్కుతుండగా భద్రతాధికారులు అడ్డుకున్నారు. కళ్లు ఎర్రగా మారడంతోపాటు అటు ఇటు తూలుతున్నట్లు కనిపించడంతో మద్యం సేవించి ఉన్నట్లు వెంటనే గుర్తించారు. అదే సమయంలో పైలట్ కు ఆల్కహాల్‌ టెస్టు నిర్వహించారు. నిబంధనల కంటే ఆరురెట్లు మద్యం స్థాయిలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే సదరు పైలట్‌ను అరెస్టు చేయడంతో చివరి క్షణంలో విమానాన్ని రద్దు చేశారు. 

పైలట్‌ను విచారించగా ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. అంతకుముందు రాత్రి కేవలం రెండు గ్లాసుల మద్యం మాత్రమే తాగినట్లు చెప్పాడు. కోర్టు ముందు ఇదే విషయాన్ని అంగీకరించాడు. ఒకవేళ అదే పరిస్థితిలో విమానం నడిపితే 267 మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లి ఉండేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో పైలట్‌కు ఆరునెలల జైలుశిక్షతోపాటు ఐదు వేల డాలర్ల జరిమానా విధించారు. 

సదరు ఎయిర్‌లైన్స్‌.. ఇటువంటి చర్యలను సహించేది లేదని స్పష్టం చేసింది. ఆ పైలట్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని.. ఈ కేసుకు సంబంధించి అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్టు ప్రకటించింది.