నడి రోడ్డుపై కూలిపోయిన విమానం.. ప్రమాద దృశ్యాలు వైరల్‌

నడి రోడ్డుపై కూలిపోయిన విమానం.. ప్రమాద దృశ్యాలు వైరల్‌

మలేసియాలో ఓ విమానం నడి రోడ్డుపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

సెంట్రల్ పహాంగ్ రాష్ట్రంలో రద్దీగా ఉన్న నాలుగు లేన్ల రోడ్డుపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. లంకావి ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం గురువారం (ఆగస్టు 17న) మధ్యాహ్నం బయలుదేరింది. సుల్తాన్‌ అబ్దుల్‌ అజీజ్‌ షా విమానాశ్రయం వైపు వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో విమానం గాల్లో అస్తవ్యస్తంగా గింగిరాలు తిరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే నేల కూలింది.

ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, మరో ద్విచక్ర వాహనదారుడు కూడా చనిపోయారని చెప్పారు. మృతుల్లో సెంట్రల్‌ పహాంగ్‌ రాష్ట్రానికి చెందిన చట్టసభ్యుడు జోహారీ హరున్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్‌బోర్డు కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ప్రమాద సమయంలో రోడ్డుపై భారీగా మంటలు వెలువడ్డాయి. పరిసరాలను నల్లని పొగ కమ్మేసింది.