లోన్ విషయంలో గొడవ.. భారతీయ బ్యాంకు ఉద్యోగిని కాల్చేసిన ఉగాండా పోలీసు

లోన్ విషయంలో గొడవ.. భారతీయ బ్యాంకు ఉద్యోగిని కాల్చేసిన ఉగాండా పోలీసు

ఉగాండా రాజధాని కంపాలాలో ఓ పోలీసు కానిస్టేబుల్ భారతీయ బ్యాంకర్ ను హత్య చేశాడు. 2.1 మిలియన్ షిల్లింగ్స్ (రూ. 46 వేలు) రుణం విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఈ హత్య జరిగింది. విధుల్లో లేని ఓ కానిస్టేబుల్... దొంగిలించిన ఏకే-47 రైఫిల్‌తో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మే 12వ తేదీన జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల ఇవాన్ వాబ్‌వైర్ ఇండియన్ బ్యాంకర్ ఉత్తమ్ భండారీపై కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా పేర్కొంది. 

ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిందితుడు వాబ్‌వైర్ అతి సమీపం నుంచి భండారీపై పలుమార్లు కాల్పులు జరపడం వీడియోలో స్పష్టంగా కనపడుతోంది. టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు భండారీ డైరెక్టర్ కాగా, నిందితుడు వాబ్‌వైర్ ఆయన క్లయింట్ అని పోలీసులు తెలిపారు. 

సంస్థకు కానిస్టేబుల్ చెల్లించాల్సిన మొత్తం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. రుణం మొత్తం ఇంకా 2.1 మిలియన్ షిల్లింగ్స్ ఉన్నట్టు భండారీ ఆయనకు చెప్పడంతో వాదన మొదలైంది. ఆ తర్వాత గొడవ మరింత ముదరడంతో దొంగిలించి తెచ్చిన ఏకే-47తో భండారీపై కాల్పులు జరిపి... అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. 

నిందితుడు వాబ్‌వైర్‌ మానసికంగా బాధపడుతుండడంతో ఆయుధాలు ఉపయోగించకుండా ఐదేళ్ల క్రితం అతడిపై నిషేధం విధించారు. ప్రస్తుతం బుసియా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన సహచర పోలీసు, రూమ్మేట్ అయిన వ్యక్తి నుంచి తుపాకి దొంగిలించాడు. ఇప్పుడు దాంతోనే భండారీపై కాల్పులు జరిపాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడు. అతడిని అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.