వ్రతాలు, చిట్టీల పేరుతో కోటిన్నర కాజేసి పరారైన పూజారి

వ్రతాలు, చిట్టీల పేరుతో కోటిన్నర కాజేసి పరారైన పూజారి

నిజామాబాద్ జిల్లాలో సుమంగళి వ్రతాలు, చిట్టీల పేరుతో మహిళల నుంచి పెద్దమొత్తంలో  డబ్బులు  వసూలు చేసి, పరారయ్యాడు ఓ పూజారి. డిచ్ పల్లి మండలం ధర్మారంలో ఈ ఘటన జరిగింది. స్థానిక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మ ... ధర్మారంతోపాటు ఆంధ్రనగర్,బోధన్,మాక్లూర్ ప్రాంతాల్లోని మహిళల నుంచి సుమంగళి వ్రతాలు, చిట్టీల పేరుతో కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు. ఈ నెల 22న కూతురుకు కరోనా వచ్చిందని కుటుంబసభ్యులతో కలిసి ఆలయం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత గ్రామానికి రాలేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని మహిళలు చెబుతున్నారు. తమను నమ్మించి మోసం చేసి డబ్బులు తీసుకొని పారిపోయాడని అంటున్నారు. భర్తలకు తెలియకుండా లక్షల రూపాయులు చిట్టీలు కట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.