ఉమ్మడి వరంగల్ పాలిటిక్స్‎లో రేర్ సీన్.. ఎమ్మెల్యే నాయిని ఇంటికి మంత్రి కొండా సురేఖ

ఉమ్మడి వరంగల్ పాలిటిక్స్‎లో రేర్ సీన్.. ఎమ్మెల్యే నాయిని ఇంటికి మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప్పు నిప్పులా ఉండే నేతలు అంతా ఒక్కచోట సమావేశం కావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం (మే18) హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‎లో మంత్రి కొండా సురేఖతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భేటీ అయ్యారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి హోదాలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటికి వచ్చారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు అంతా ఈ సమావేశంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ భేటీ హాట్ టాపిక్‎గా మారింది. ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఇలా అనుహ్యంగా భేటీ కావడం వెనక కారణమేంటనే చర్చించుకుంటున్నారు. 

ఎలాంటి రాజకీయం లేదు: మంత్రి కొండా సురేఖ

ఈ భేటీపై మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో ఎలాంటి రాజకీయం లేదని తెలిపారు. మా సోదరుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో కలిశామని వివరణ ఇచ్చారు. వరంగల్ జిల్లా అభివృద్ధిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని చర్చించామని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబమని.. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న మనస్పర్దాలు, కలహాలు సహజమని పేర్కొన్నారు. మాలో ఎలాంటి విభేదాలు లేవని.. మేమంతా ఒక్కటేనని అన్నారు. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సమన్వయంతో పని చేయలని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.