గండిపేట్, హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద

గండిపేట్, హిమాయత్ సాగర్ కు పోటెత్తిన వరద

రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయం దగ్గర మూసీ వరదల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని రెస్క్యూ టీమ్ కాపాడింది. జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో మంగళవారం సాయంత్రం అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీలోకి వదిలారు. నదీ పరీవాహక ప్రాంతంలోని ఓ ఫామ్ హౌజ్ లో పని చేస్తున్న కుటుంబం వరదల్లో చిక్కుకుంది. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, జలమండలి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి  చేరుకుంది. స్పాట్ కు చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. వెంటనే NDRF బృందాలను రప్పించారు. కొన్ని గంటలపాటు శ్రమించి బాధిత కుటుంబ సభ్యులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే నీటిని విడుదల చేశారని బాధితులు వాపోయారు.

పరిగి, వికారాబాద్, చెవెళ్ల ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడంతో గండిపేట్, హిమాయత్ సాగర్ లకు వరద పోటెత్తింది. గండిపేట్ 12 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లను జలమండలి అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గండిపేట్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద నీరు మూసీని తాకింది. దీంతో గండిపేట్ వద్ద వరదల్లో ఓ కుటుంబం చిక్కుకుంది. NDRF బృందాల రెస్క్యూ ఆపరేషన్ తో  కుటుంబ సభ్యులను కాపాడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.