ఢిల్లీ ప్రభుత్వ విద్యావిధానం బాగుంది

ఢిల్లీ ప్రభుత్వ విద్యావిధానం బాగుంది
  • మొహల్లా క్లినిక్స్​ స్ఫూర్తితోనే హైదరాబాద్​లో బస్తీ దవాఖాన్లు
  • పాలసీలపై రాష్ట్రాలతో చర్చించకుండా కేంద్రం ముందుకెళ్తే ఇబ్బందులే అని కామెంట్​
  • కేజ్రీవాల్‌‌‌‌, అఖిలేశ్‌‌‌‌తో చర్చలు

హైదరాబాద్‌‌‌‌ / న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజకీయాల్లో ఒక సంచలనం జరగాల్సి ఉందని, తొందర్లోనే అది జరిగి తీరుతుందని, భవిష్యత్‌‌‌‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సమాజ్​వాదీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​తో భేటీ అయ్యారు. సాయంత్రం ఢిల్లీలోని సర్వోదయ స్కూల్​ను ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్‌‌‌‌ సిసోడియాతో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 
అఖిలేశ్‌‌ యాదవ్‌‌తో ఏం చర్చించారని మీడియా ప్రశ్నించగా.. ‘‘బిజినెస్‌‌ పీపుల్‌‌ను కలిస్తే బిజినెస్‌‌ గురించే చర్చిస్తం.. రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాడుకుంటం’’ అని అన్నారు. దేశ రాజకీయాల్లో సెన్సేషన్​ జరగాల్సి ఉందని, జరుగుతుంది అని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎడ్యుకేషన్‌‌ పాలసీ అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. స్టూడెంట్లను జాబ్‌‌ సీకర్స్‌‌గా కాకుండా జాబ్‌‌ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం బాగుందని కితాబిచ్చారు. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు ఢిల్లీలాంటి విధానం అవసరమన్నారు. త్వరలోనే రాష్ట్రం నుంచి అధికారులు, టీచర్ల బృందాలను ఢిల్లీకి పంపి విద్యావిధానంపై స్టడీ చేయిస్తామని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌ సొంతంగా ఈ విధానం రూపొందించారని కేసీఆర్​ అభినందించారు. 
ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు మెరుగయ్యాయని, దీంతో కార్పొరేట్‌‌ స్కూళ్లలో అడ్మిషన్లు పడిపోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యావిధానం తీసుకురావడం మంచి పరిణామమేనని, కానీ పాలసీలపై నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించాలని కేసీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్రాలతో చర్చించకుండా కేంద్రం ముందుకెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. తమ విద్యావిధానం, ఏటా స్కూళ్ల కోసం చేస్తున్న ఖర్చు, ఇతర వివరాలపై కేజ్రీవాల్‌‌ అరగంట పాటు పవర్‌‌ పాయింట్‌‌ ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. 
తాము చేపట్టిన సంస్కరణలు, స్కూల్‌‌ కరికులమ్‌‌పై డిప్యూటీ సీఎం మనీశ్‌‌ సిసోడియా వివరించారు. కేసీఆర్‌‌ ఢిల్లీలోని స్కూల్‌‌ను సందర్శించడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్‌‌ అన్నారు. కేసీఆర్‌‌ అన్ని గదులు తిరిగి పరిశీలించారని, ప్రతి అంశంపై ప్రశ్నలడిగి వివరాలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. సర్వోదయ స్కూల్‌‌ పరిశీలించిన అనంతరం కేసీఆర్‌‌, కేజ్రీవాల్‌‌ కలిసి ఒకేకారులో మహ్మద్‌‌పూర్‌‌ మొహల్లా క్లినిక్‌‌కు వెళ్లారు. మొహల్లా క్లినిక్స్‌‌ గురించి తెలుసుకొని అధికారుల బృందంతో స్టడీ చేయించానని, తానే స్వయంగా వాటిని పరిశీలించేందుకు వచ్చానని కేసీఆర్‌‌ అన్నారు. వీటి స్ఫూర్తితోనే హైదరాబాద్‌‌లో 350 బస్తీ దవాఖానలు ప్రారంభించామన్నారు. ఒక్కో షిఫ్టులో మొహల్లా క్లీనిక్‌‌కు వంద మంది వరకు రోగులు రావడం మంచిపరిణామమని చెప్పారు. 
దేశ రాజకీయ పరిస్థితులపై అఖిలేశ్​తో చర్చ 
శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌‌ శనివారం రోజంతా బిజీబిజీగా గడిపారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటులో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై 23 తుగ్లక్‌‌ రోడ్డులోని తన నివాసంలో ఆర్థిక నిపుణులతో కేసీఆర్‌‌ చర్చించారు. ఎస్పీ చీఫ్​, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌‌తో కలిసి మధ్యాహ్న భోజనం చేసి దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బలమైన అభ్యర్థిని పోటీకి దించాలనే అంశంపై మాట్లాడినట్టు సమాచారం. 
కేసీఆర్‌‌తో భేటీ అనంతరం అఖిలేశ్‌‌ యాదవ్‌‌ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. సాయంత్రం ఆమ్‌‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌తో సమావేశమయ్యారు. దక్షిణ మోతాబాగ్‌‌లోని సర్వోదయ స్కూల్​తో పాటు మహ్మద్‌‌పూర్‌‌లోని మోహల్లా క్లీనిక్‌‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కొంతమంది స్టూడెంట్స్‌‌తో కేసీఆర్‌‌ ముచ్చటించారు. సీఎం వెంట మంత్రి వేముల ప్రశాంత్‌‌ రెడ్డి, ఎంపీలు నామ నాగేశ్వర్‌‌ రావు, రంజిత్‌‌ రెడ్డి, సంతోష్‌‌ కుమార్‌‌, ఎమ్మెల్యే డాక్టర్‌‌ మెతుకు ఆనంద్‌‌ తదితరులు ఉన్నారు. కాగా, ఢిల్లీలోని తన నివాసంలో శనివారం రాత్రి ప్రముఖ జర్నలిస్టు, ఆర్థికవేత్త ప్రణయ్‌‌ రాయ్‌‌తో సీఎం కేసీఆర్‌‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య దేశంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులపై చర్చ జరిగినట్టు టీఆర్‌‌ఎస్‌‌ వర్గాలు తెలిపాయి.