ఏడేండ్ల బాలుడు ఎస్సై అయ్యిండు!

ఏడేండ్ల బాలుడు ఎస్సై అయ్యిండు!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏడేండ్ల బాలుడు సబ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ అయ్యాడు. పోలీస్ యూనిఫామ్‌‌‌‌‌‌‌‌, నెత్తిన టోపీ, చేతిలో లాఠీ, బొమ్మ తుపాకీ పట్టుకుని పోలీస్ స్టేషన్ లో ఎస్సై కుర్చీ‌‌‌‌‌‌‌‌లో కూర్చున్నాడు. పోలీసుల నుంచి గౌరవం వందనం కూడా స్వీకరించాడు. ఫైల్స్‌‌‌‌‌‌‌‌పై సంతకాలు పెట్టాడు. స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వారితో మాట్లాడాడు. పోలీస్ అధికారి కావాలన్న తన కోరికను తీర్చుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం జరిగింది.

రెక్టమ్ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను ఇలా పోలీసుల సహకారంతో ‘మేక్‌‌‌‌‌‌‌‌ ఏ విష్’ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ నెరవేర్చింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన అనుపోజు బ్రహ్మం, లక్ష్మి దంపతుల రెండో కొడుకు మోహన్‌‌‌‌‌‌‌‌సాయి(7) స్థానిక స్కూల్‌‌‌‌‌‌‌‌లో 4వ తరగతి పూర్తి చేశాడు. గతేడాది స్కూల్‌‌‌‌‌‌‌‌ సెలవుల్లో అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి రెక్టమ్ క్యాన్సర్ వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. మోహన్ సాయి పరిస్థితి విషమిస్తుండడంతో తల్లిదండ్రులు బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ చేశారు.

గత ఏడాది కాలంగా మోహన్‌‌‌‌‌‌‌‌సాయి చికిత్స పొందుతున్నాడు. పెద్దయ్యాక తాను పోలీస్‌‌‌‌‌‌‌‌ కావాలనుకున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇదే విషయాన్ని హాస్పిటల్ సిబ్బందితో చెప్పుకుని అతడి పేరెంట్స్ బాధపడ్డారు. దీంతో హాస్పిటల్ సిబ్బంది మేక్ ఏ విష్ ఫౌండేషన్ కు సమాచారం అందించారు.  

బంజారాహిల్స్ పీఎస్‌‌‌‌‌‌‌‌లో డ్యూటీ

మోహన్ సాయి కోరికను తీర్చాలని భావించిన ఫౌండేషన్ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులను సంప్రదించారు. డిటెక్టివ్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ జాకీర్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మోహన్ సాయి కోరిక నెరవేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. యూనిఫామ్ వేసుకున్న మోహన్‌‌‌‌‌‌‌‌సాయిని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు సాదరంగా ఆహ్వానించారు. పోలీసులు అంతా సెల్యూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఎస్సై కుర్చీలో కూర్చోబెట్టారు. పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటుందో వివరించారు. అనంతరం డీఐ జాకీర్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌, ఎస్సైలు శివశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రవీందర్‌‌‌‌‌‌‌‌ కలిసి.. చైల్డ్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బహుమతులు కూడా అందించారు. మోహన్ సాయి పోలీస్ కోరిక తీరడంతో అతడితో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.