మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీసులు బైక్ చోరీలపై ఉక్కుపాదం మోపారు. వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ కిలాడీ దొంగను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి ఏకంగా 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
కుషాయిగూడ పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న బైక్ చోరీలపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం, ప్యారారం గ్రామానికి చెందిన చిందం రాజు అనే 27 ఏళ్ల యువకుడు పెయింటింగ్ పనిచేస్తూ.. జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బైక్ దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడు. కుషాయిగూడ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇతను బైక్ చోరీలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు.
►ALSO READ | హాస్పిటల్ యాజమాన్యం వేధింపులు..మత్తు ఇంజక్షన్ తీసుకుని హైదరాబాద్ లో డాక్టర్ ఆత్మహత్య
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న 14 ద్విచక్ర వాహనాల విలువ లక్షల్లో ఉంటుందని డీసీపీ తెలిపారు. అంతేకాదు, నిందితుడు రాజు గతంలో అంటే 2022 లో కూడా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. బైక్ చోరీల నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజలు తమ వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ (GPS) సిస్టమ్స్ అమర్చుకోవాలని, అలాగే పాతబడిపోయిన బైక్ తాళాల స్థానంలో అప్పుడప్పుడు కొత్త తాళాలు వేయించుకోవాలని డీసీపీ సురేష్ కుమార్ సూచించారు.
