మూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు

మూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు
  •  నదిలో నీటి ప్రవాహం స్టడీ చేసేందుకు హైడ్రాలిక్​ సర్వే
  • నదికి ఇరువైపులా రెటెయినింగ్​వాల్​నిర్మాణానికి చర్యలు
  • సర్వే పనులను కన్సల్టెన్సీలను ఎంపిక చేసిన హెచ్ఎండీఏ
  • ఇచ్చే రిపోర్టుల్లోంచి మెరుగ్గా ఉండే కన్సల్టెన్సీకి పనులు

హైదరాబాద్,వెలుగు: మూసీ బ్యూటిఫికేషన్ లో ముందడుగు పడింది. మూసీ రివర్​ఫ్రంట్​డెవలప్​మెంట్​ప్రాజెక్టును కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినది తెలిసిందే. ముఖ్యంగా నది చుట్టూ అభివృద్ధి చేయడంతో పాటు, ఎంటర్ టెయిన్​ మెంట్, ఉపాధి, బిజినెస్​ కారిడార్ల వంటివి కల్పించనుంది. దీంతో నదిలో నీటి ప్రవాహ తీరును పరిశీలించడంతో పాటు ఇరువైపులా రిటెయినింగ్​వాల్​నిర్మాణానికి అధికారులు చర్యలు చేప్టటారు.  

భవిష్యత్​లో ఎంత పెద్ద వరదలు వచ్చినా, ఎగువన ఉన్న ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​ ఫుల్​టాంక్​ లెవల్​కు చేరితే  ప్రాజెక్టు గేట్లు తెరిస్తే .. ఆ వరద నీరంతా మూసీలోంచే ప్రవహిస్తుంది. దీంతో   బ్యూటిఫికేషన్ , డెవలప్​మెంట్​ పనులను 50 ఏండ్లు దృష్టిలో ఉంచుకుని పనులు చేపడతారు. ప్రాజెక్టు పూర్తయితే ప్రపంచంలోని ప్రముఖ నదుల్లో ఒకటైన థేమ్స్​ మాదిరిగా అభివృద్ధి చేయాలనే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

 అందుకు అనుగుణంగానే మూసీ అభివృద్ధి పనులు వేగవంతం చేయడంలో భాగంగానే నదీ ప్రవాహ తీరును పరిశీలించే సర్వే పనులను చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. ఇందుకు వివిధ కన్సల్టెన్సీ సంస్థల నుంచి ‘ఎక్స్ ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​’ (ఈఓఐ) కోసం సిములేషన్​ మోడల్​హైడ్రాలిక్​ సర్వే, రిటెయినింగ్​వాల్​నిర్మాణం కోసం టెండర్లను పిలవగా, ఇందులో 8 కన్సల్టెన్సీ సంస్థలను అధికారులు ఎంపిక చేశారు. అవి ఇచ్చే నివేదికల్లో ఏది అధిక ప్రయోజనకరంగా ఉంటుందో ఆ సంస్థకు పనులు అప్పగిస్తారు. 

హైడ్రాలిక్​ సర్వే ద్వారా స్టడీ 

సిములేషన్​ హైడ్రాలిక్ సర్వే అంటే నదిలో నీటి ప్రవాహం, పరీవాహక ప్రాంతాలు, భవిష్యత్​లో వరదలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలపై క్షుణ్ణంగా స్టడీ చేస్తారు.1908లో మూసీకి భారీ వరదలు రావడంతో హైదరాబాద్​లో తీవ్ర విధ్వంసం జరిగింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి నష్టం వాటిల్లింది. అలాంటి పరిస్థితులు భవిష్యత్​లో వచ్చినా తట్టుకునేందుకు ఎలాంటి ప్లాన్ రూపొందించాలనే దానిపై కూడా అధికారులు సర్వేలో స్టడీ చేస్తారు.

 అలాగే పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటివరకు కురిసిన వర్షపాతం ఎంత, భవిష్యత్​లో ఎక్కువ కురిస్తే మూసీలో ప్రవాహం ఏ మేరకు ఉంటుందనేది కూడా అధ్యయనం చేస్తారు. రాబోయే వందేండ్లను దృష్టిలో పెట్టుకుని సర్వేను నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ​సర్వేలో భాగంగా మూసీకి ఎగువన ఉన్న ఉస్మాన్​సాగర్​డ్యామ్​డౌన్​స్ర్టీమ్​పాయింట్​నుంచి తూర్పున గౌరెల్లి వరకు, హిమాయత్​సాగర్​డ్యామ్ డౌన్​స్ట్రీమ్​నుంచి బాపూఘాట్​వరకూ మూసీ ప్రవాహాలపై స్టడీ చేయడమే కాకుండా ఇరువైపులా రిటెయినింగ్​వాల్​నిర్మాణం చేపడతారు. దీనికి ఎంత వ్యయం అవుతుంది.  ఏ పద్ధతిలో సర్వే చేస్తే కచ్చితమైన వివరాలు తెలుస్తాయి, రిటెయినింగ్​వాల్​నిర్మాణానికి అయ్యే వ్యయం వంటి అంశాలపై కన్సల్టెన్సీ సంస్థలు నివేదిక ఇవ్వనున్నాయి. 

 రాష్ట్ర బడ్జెట్ లో రూ. 1500 కోట్లు

మూసీ బ్యూటిఫికేషన్ పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో 1500 కోట్లు కేటాయించింది. వచ్చే నిధులతో సర్వే పనులు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అధికారులు చేపడతారు.  జాతీయ నదుల అభివృద్ధి పథకం(ఎన్ఆర్ డీసీ) ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టి.. మూసీ చుట్టూ అభివృద్ధి పనులే కాకుండా నది పొడవునా 15 వంతెనలు నిర్మించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 11 బ్రిడ్జిలను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో, మరో 4 బ్రిడ్జిలు జీహెచ్ఎంసీ నిర్మించనుంది. ఆయా పనులకు దాదాపు  రూ. 700 కోట్లు ఖర్చు చేస్తారు.

వరదలు వచ్చినా నష్టపోకుండా..

సిటీకి తూర్పున ఔటర్ పరిధిలోని గౌరెల్లి నుంచి పశ్చిమాన ఔటర్ పరిధిలోని నార్సింగి వరకు 55 కి.మీ మేర మూసీ అభివృద్ధికి ఇప్పటికే ఎంఆర్డీసీఎల్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మూడేళ్లలో అభివృద్ధి పనులను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయాలని సీఎం రేవంత్‌‌రెడ్డి కూడా ఆదేశించగా.. ఆ దిశగా అధికారులు కార్యాచరణ తయారు చేసే పని నిమగ్నం అయ్యా రు. విదేశాల్లో  పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను అధికారుల టీమ్ పరిశీలించి..  మూసీ అభివృద్ధికి రూ. 60వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేసింది. 

నది అభివృద్ధిలో భాగంగా 39 ప్రాంతాల్లో ఎస్టీపీలతో నీటిని శుద్ధి చేయడంతో పాటు  పీపుల్స్ ప్లాజాలు, సైకిల్ ట్రాక్‌‌లు, గ్రీన్‌‌ వేలు, హాకర్‌‌ జోన్లు, వంతెనలు, వినోద, పర్యాటక ప్రాంతాలు, క్రీడా సౌకర్యాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలు, ఆతిథ్య మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్​లో వరదలు వచ్చినా వీటికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే హైడ్రాలిక్​సర్వేను నిర్వహించాలనే ఆలోచన చేశాక .. ఇచ్చే సర్వే ఆధారంగానే ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తారని అధికారులు తెలిపారు.