కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి వెయ్యి కోట్లు

కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి వెయ్యి కోట్లు
  • దేశవ్యాప్తంగా వేడుకలు, పరేడ్లు
  • ఈ నెల 6న అత్యంత వైభంగా కార్యక్రమం
  • అతిరథ మహారథుల రాక..
  • ఉపాధ్యక్షుడు జగ్దీప్  ధన్​ఖడ్​కు ఆహ్వానం

లండన్: మహారాజు పట్టాభిషేకం అంటే రాజ్యమంతా కోలాహలం, సందడి, ఊరేగింపులు. పక్క రాజ్యాల అతిరథ మహారథులకు ఆహ్వానాలు పంపడం వంటి సందడి నెలకొంటుంది. బ్రిటన్  రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా జరగనుంది. 74 ఏండ్ల చార్లెస్ కు ఈ నెల 6న పట్టాభిషేకం చేయనున్నారు. ఆయన తల్లి ఎలిజబెత్ 2 నిరుడు సెప్టెంబరులో మరణించిన తర్వాత చార్లెస్ 3 సింహాసనాన్ని అధిష్టించిన విషయం తెలిసిందే. ఇపుడు అధికారికంగా రూ.వెయ్యి కోట్లతో పట్టాభిషేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పరేడ్లు జరపనున్నారు. ఇండియా తరపున ఉపాధ్యక్షుడు జగ్దీప్  ధన్​ఖడ్​ ఈ వేడుకలకు హాజరవుతారు.


మేఘన్  తోడు లేకుండా ప్రిన్స్  హ్యారీ..


 చార్లెస్ 3 పట్టాభిషేక వేడుకలకు తన భార్య మేఘన్  లేకుండానే ప్రిన్స్ హ్యారీ హాజరు కానున్నారు. ఈ మేరకు బకింగ్ హామ్  ప్యాలెస్  వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ పేర్కొంది. రాజ కుటుంబ సభ్యులకు పది వరుసల వెనుక హ్యారీకి సీటు కేటాయించారు. తన కొడుకు అర్కీ బర్త్ డే ఉండడంతో కార్యక్రమం ముగిసిన వెంటనే హ్యారీ అమెరికా బయల్దేరతారు. 


ఇంత దుబారా అవసరమా?


బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేక వేడుకలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టడం వివాదాస్పదం అవుతోంది. ప్రస్తుతం దేశం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి వేడుకలు నిర్వహించాలా అని పౌరులు నిలదీస్తున్నారు. తాము కష్టపడి ప్రభుత్వానికి కట్టిన పన్నులను వృధా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో బ్రిటన్  ప్రభుత్వమే పట్టాభిషేక ఖర్చును భరించనుంది. పట్టాభిషేక ఏర్పాట్లను ‘ది ఆపరేషన్  గోల్డెన్  ఆర్బ్  కమిటీ’ చూసుకుంటోందని టైమ్  మేగజీన్  తెలిపింది.


కోహినూర్  వజ్రం ధరించకుండానే ..


రాజు చార్లెస్ 3 పట్టాభిషేకంలో ఆయన భార్య కమిల్లా కోహినూర్  వజ్రం ధరించకుండానే ఈ కార్యక్రమంలో కనిపించనున్నారు. కోహినూర్ ను వెనక్కి ఇచ్చేయాలని ఇండియా గత కొన్నేండ్లుగా డిమాండ్  చేస్తున్న నేపథ్యంలో రాజ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాణి కమిల్లా కోహినూర్  ధరించి వేడుకల్లో పాల్గొంటే ఇండియాతో దౌత్యపరమైన సమస్యలు రావొచ్చని బ్రిటన్  మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో కోహినూర్ కు బదులుగా క్వీన్  మేరీ కిరీటాన్ని ఆమె ధరించనున్నారు.


2,200 మంది అతిథులు


చార్లెస్ 3 పట్టాభిషేకానికి 203 దేశాల నుంచి 2200 మంది అతిథులు హాజరు కానున్నారు. అతిథుల్లో వంద దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. అలాగే రాజ కుటుంబానికి సేవలందిస్తున్న ఇండియన్  కమ్యూనిటీ వర్కర్లకూ ఆహ్వానం అందింది. వారిలో ప్రిన్స్  ఫౌండేషన్  బిల్డింగ్  క్రాఫ్ట్  ప్రోగ్రాంలో గ్రాడ్యుయేషన్  చేసిన సౌరభ్  ఫాడ్కే (37) కూడా ఉన్నారు. చార్లెస్  వేల్స్  రాకుమారునిగా ఉన్నపుడు స్కాట్లాండ్​లో ఈ స్కూల్ ను స్థాపించారు.