పెద్దపల్లిలో విలేజ్ లోకి పులి..భయాందోళనలో గ్రామస్తులు

పెద్దపల్లిలో విలేజ్ లోకి  పులి..భయాందోళనలో గ్రామస్తులు
  • ఈస్గాం విలేజ్ నంబర్ 13లో సర్దార్ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి పచార్లు
  • భయాందోళనలో గ్రామస్తులు

కాగజ్ నగర్, వెలుగు: పెద్దపులి అడవిని వదిలి ఊర్లలోకి వస్తోంది. కాగజ్ నగర్ పట్టణ శివారుతో పాటు, మండలంలో పెద్దపులి అలజడి ఆగడం లేదు. మూడు రోజుల కింద కాగజ్​నగర్ లో మెయిన్ రోడ్ దాటుతు పులి కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి మండలంలోని ఈస్గాం విలేజ్ నంబర్ 13 లో పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి పులి వచ్చింది. ఇంటి ముందు కట్టేసిన కుక్కలు మొరగడంతో మేల్కొన్న పలాస్, ఆయన సోదరుడు కిటికీలోంచి బయటకు చూశారు. అయితే చీకట్లో వారికి ఏమీ కనిపించకపోవడంతో నిద్రపోయారు. పొద్దున మేల్కొన్న సర్దార్ కు ఇంటి ఆవరణలో పెద్దపులి అడుగులు కనిపించాయి.

దీంతో భయాందోళనకు గురై ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. రాత్రి కుక్కల అరుపులతో పక్కనున్న పొలాల వైపు వెళ్లినట్టుందని పులాస్ సర్దార్ చెప్పారు. ఫారెస్ట్ సిబ్బంది శనివారం పొద్దున ఆయన ఇంటికి చేరుకొని పులి పాదముద్రలు గుర్తించారు. రాత్రివేళ ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో పుట్టుకొస్తున్న పుకా ర్లు ప్రజలను ఇంకా భయపెడుతున్నాయి. కుక్కలు తదితర కొన్ని జంతువులను దూరం నుంచి ఫొటోలు తీసి ఇదిగో పులి.. అదిగో పులి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతుడడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.