అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా..సెప్టెంబర్ లోనే 23 కేసులు

అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా..సెప్టెంబర్ లోనే 23 కేసులు

హైదరాబాద్‌‌, వెలుగు: అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝలిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 203 కేసుల్లో189 మంది ప్రభుత్వ అధికారులు, 15 మంది అవుట్‌‌సోర్సింగ్ ఉద్యోగులను అరెస్టు చేసింది. ఇందులో ఒక్క సెప్టెంబర్‌‌‌‌ నెలలోనే 23 కేసులు నమోదు కాగా.. వీటిలో 11 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రెండు క్రిమినల్ మిస్‌‌ కండక్ట్ కేసులు, ఆరు రెగ్యులర్ విచారణలు, రెండు ఆకస్మిక తనిఖీలు ఉన్నట్టు ఏసీబీ డైరెక్టర్‌‌ జనరల్‌‌ ఆఫీసు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

వీటిలో అవుట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగి సహా 22 మంది ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసినట్టు పేర్కొన్నారు. లంచం తీసుకుంటుండగా రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న ట్రాప్‌‌ కేసులలో రూ.8.91 లక్షలు- స్వాధీనం చేసుకోగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రూ.14,03 కోట్లు విలువైన ఆస్తులు గుర్తించినట్టు తెలిపారు. సెప్టెంబర్ లో 25 కేసులను పరిష్కరించి, తుది నివేదికలను ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 204 కేసులు పరిష్కరించినట్టు వెల్లడించారు.