
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో మైనింగ్ చేస్తున్న మొత్తం 68 సంస్థలు 5 స్టార్ రేటింగ్ సాధించాయి. అందులో తెలంగాణ నుంచి ఐదు(అన్నీ లైమ్ స్టోన్ మైన్స్) మైనింగ్ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో 5 స్టార్ రేటింగ్ అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థికాభివృద్ధిలో గనుల పాత్ర కీలకమన్నారు.
మైనింగ్ రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న వారందరినీ అభినందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతన్నారు. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్.. హైదరాబాద్ లో ఓ వర్క్ షాప్ నిర్వహించిందని గుర్తుచేశారు. "ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
దేశ వనరులను సద్వినియోగం చేసుకుంటే దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. టెక్నాలజీని ఉపయోగించి మైనింగ్ అభివృద్ధికి కృషి చేయాలని మైనింగ్ కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్న. 25 క్రిటికల్ మినరల్స్ మీద కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తొలగించింది. దీని ద్వారా దేశంలో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్ మెరుగుపడుతుంది" అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం నుంచి 5 స్టార్ రేటింగ్ సంస్థలివే..
- 1. మైహోం చౌటుపల్లి- 1
- 2. టీఎస్ఎండీసీ -
- దేవాపూర్ -మంచిర్యాల
- 3. మైహోం - మెల్ల -చెరువు
- 4. రైన్ సిమెంట్స్ - నల్గొండ
- 5. సాగర్ సిమెంట్స్-నల్గొండ