టెక్సస్​ డెయిరీ ఫాంలో భారీ పేలుడు

టెక్సస్​ డెయిరీ ఫాంలో భారీ పేలుడు
  • టెక్సస్​ డెయిరీ ఫాంలో భారీ పేలుడు
  • 18 వేల ఆవులు మృత్యువాత.. వాటి విలువ రూ.300 కోట్లు
  • యంత్రాల ఓవర్​ హీట్​ వల్లే ప్రమాదం

టెక్సస్ : టెక్సస్ లోని ఓ డెయిరీ ఫాంలో భారీ పేలుడు సంభవించింది. దిమ్మిట్​ లోని సౌత్​ ఫోర్క్ డెయిరీలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ఫాం​లోని 18 వేల ఆవులు మృత్యువాత పడ్డాయి. సిబ్బందిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మంటలు, పొగ భారీగా ఎగిసిపడ్డాయి. ఫాంలోని యంత్రాలు వేడెక్కడం వల్లే ఈ పేలుడు జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన ఆవుల విలువ 36 మిలియన్​ డాలర్ల(దాదాపురూ.300 కోట్లు) పైనే ఉంటుందని ఎనిమల్​ వెల్ఫేర్​ అధికారులు చెబుతున్నారు. డైరీ ఫాంలోని యంత్రాలు, నిర్మాణాలు కూడా నాశనమయ్యాయని, వాటి విలువ ప్రస్తుతానికి అంచనా వేయలేమని చెప్పారు. డెయిరీ ఫాం చరిత్రలోనే ఈ స్థాయిలో ఆవుల ప్రాణనష్టం జరగలేదని ఎనిమల్​ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్​ వెల్లడించింది.

స్థానికుల విచారం..

ఇది ఫ్రాంక్​ బ్రాండ్​డెయిరీస్ కు చెందిన డెయిరీ ఫాం అని అధికారులు తెలిపారు. ఈ వారం మొదట్లో పేలుడు జరిగిందని, గాయపడ్డ మహిళా కార్మికురాలు ఇప్పటికీ ఆస్పత్రిలోనే ఉందని వివరించారు. కాగా, పేలుడు జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని డెయిరీ ఫాం దగ్గర్లోని దిమ్మిట్​ కౌంటీ ( గ్రామం) వాసులు తెలిపారు. డెయిరీ ఫాం ఉన్న చోట పొగ ఎగిసిపడడం చాలా దూరం నుంచే కనిపించిందని చెప్పారు. ఫాం ధ్వంసం కావడంతో తమకు ఉపాధి పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.