102 సిబ్బంది నిర్వాకం: వర్షంలో తడుస్తూ పచ్చి బాలింత 3 కి.మీ నడక

102 సిబ్బంది నిర్వాకం: వర్షంలో తడుస్తూ పచ్చి బాలింత 3 కి.మీ నడక
  • పచ్చి బాలింతను అడవిలో వదిలేసి..3 కిలోమీటర్లు నడిపించిన్రు
  • తొవ్వ సరిగ లేదని మధ్యలోనే దించేసిన 102  సిబ్బంది
  • చంటి బిడ్డతో వానలో తడుస్తూ.. ఇల్లు చేరిన గిరిజన మహిళ

కాగజ్ నగర్, వెలుగు: తొవ్వ సరిగ లేదని అడవి మధ్యలోనే దించేయడంతో.. ప్రసవించిన గంటల వ్యవధిలోనే ఓ బాలింత రాళ్లూ రప్పల మీద మూడు కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది.102 సిబ్బంది నిర్వాకానికి చంటి బిడ్డతో వర్షంలో తడుస్తూ ఇల్లు చేరింది. ఈ ఘటన గురువారం సాయంత్రం కుమ్రంబీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల్​పేట మండలంలో జరిగింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మురళిగూడ పంచాయతీలోని జిల్లెడకు చెందిన కోరేటి కవితకు నొప్పులు రావడంతో బుధవారం కాగజ్​నగర్​ పీహెచ్​సీకి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి11.20 నిమిషాలకు ఆమె కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను కొన్ని గంటల పాటు పర్యవేక్షణలో ఉంచిన పీహెచ్​సీ సిబ్బంది గురువారం మధ్యాహ్నం102 వాహనంలో ఇంటికి పంపారు. ఆస్పత్రి నుంచి బయలుదేరిన102 వాహనం పెంచికల్​పేట మండలం కమ్మర్​గాం మీదుగా అటవీ ప్రాంతానికి చేరింది. ఇక ముందుకు వెళ్లలేనని డ్రైవర్​కవితను ఆమెతోపాటు ఉన్న భర్త రమేశ్, అత్త, తల్లిని అక్కడే దించేశాడు. ఈ దారిలో ఆటోలు, టాటా మ్యాజిక్​లు నడుస్తాయని బాలింత సహా ఆమె కుటుంబీకులు ఎంత బతిమిలాడిన వినలేదు. దీంతో చంటిబిడ్డను కుటుంబీకులు ఎత్తుకోగా, ఆమె వారితో పాటు మూడు కిలోమీటర్లు నడిచింది. బాలింతతో పాటు పాప వర్షంలో తడుస్తూ రాత్రిలోగా ఇల్లు చేరారు. ఈ ఘటనపై డిప్యూటీ డీఎంహెచ్​వో సీతారాం నాయక్​ను వివరణ కోరగా.. విషయం తెలిసిందని, 102 సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు తెలిపారు.