ట్రక్కును ట్రాలీ ఆటో ఢీకొని.. 10 మంది మృతి

ట్రక్కును ట్రాలీ ఆటో ఢీకొని..  10 మంది మృతి
  • 13 మందికి తీవ్ర గాయాలు
  • గుజరాత్​లోని అహ్మదాబాద్  జిల్లాలో ప్రమాదం
  • మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం

అహ్మదాబాద్: గుజరాత్​లోని అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును ట్రాలీ ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పది మంది చనిపోగా మరో13 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 11.30  గంటలకు రాజ్ కోట్– అహ్మదాబాద్  హైవేలో బాగోదర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బాధితులంతా సురేంద్రనగర్  జిల్లాలోని చోటిలా నుంచి అహ్మదాబాద్​కు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్  చోటుచేసుకుంది. 

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రవాణా కోసం వాడాల్సిన ఆటో ట్రాలీలో ప్రయాణికులను తరలించారని పోలీసులు  తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాలీలో 23 మంది ఉన్నారని చెప్పారు. పంక్చర్  అయిన కారణంగా రోడ్డు పక్కన నిలిపిన ట్రక్కును ఆ వాహనం ఢీకొట్టిందని పేర్కొన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారు, గాయపడిన వారు ఖేడా జిల్లాకు చెందిన వారని వెల్లడించారు.

ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

అహ్మదాబాద్  జిల్లాలో ప్రమాదం వార్త తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్  చేశారు. 

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి రిలీఫ్​ ఫండ్  నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామని మోదీ ప్రకటించారని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. బాధితులకు మెరుగైన ట్రీట్ మెంట్  అందించాలని అధికారులను ప్రధాని ఆదేశించారని పీఎంఓ ప్రకటించింది.