
హైదరాబాద్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగుస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని విషద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 07) టస్కర్ ఢీకొట్టడంతో జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి చెందడం విషాదం మిగిల్చింది. రోడ్డు దాటుతున్న కార్మికురాలను టస్కర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
గుడిమల్కాపూర్ కు చెందిన రేణుక గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. బషీర్ బాగ్ నుండి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో.. మూత్రవిసర్జన కోసం రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో బషీర్ బాగ్ నుండి వస్తున్న టస్కర్ వాహనం కింద రేణుక ప్రమాదవశాత్తు పడటంతో ఆమెపై నుండి వాహనం వెళ్ళింది.
మహిళ తలకు బలమైన గాయం కావడంతో... అక్కడే ఉన్న మరికొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆమెను పక్కనే ఉన్న ఓ ప్రేవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
దీంతో టస్కర్ డ్రైవర్ గజానంద్ ను అదుపులోకి తీసుకున్న సైఫాబాద్ పోలీసులు , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.