
జీడిమెట్ల, వెలుగు: అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. వీరు ప్రయాణిస్తున్న కారును రాంగ్రూట్లో వచ్చిన మినీ ట్రక్కు ఢీకొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు పిల్లలుసహా దంపతులు కాలి బూడిదయ్యారు. ఈ ఘటన అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో జరిగింది.
కొంపల్లిలోని ఎన్సీఎల్నార్త్ కాలనీకి చెందిన రవి, అనిత దంపతుల కూతురు తేజస్వినికి మనోహరాబాద్‌కు చెందిన వెంకట్తో వివాహమైంది. వీరికి పాప, బాబు ఉన్నారు. మూడేండ్ల క్రితం వీరి కుటుంబం అమెరికాకు వెళ్లింది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ డల్లాస్‌లో నివాసముంటున్నారు. కాగా, సెలవులు కావడంతో వెకేషన్ కోసం కారులో అట్లాంటా వెళ్లారు. తిరిగి డల్లాస్ వస్తుండగా గ్రీన్కౌంటీఏరియాలో వీరి కారును రాంగ్రూట్లో వచ్చిన మినీ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి.
తేజస్విని, వెంకట్‌తోపాటు వారి పాప, బాబు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే టెక్సస్పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయినా, వీరిని రక్షించడం సాధ్యం కాలేదు. మినీ ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్‌లో రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ట్రక్ డ్రైవర్‌ను గుర్తించేందుకు , అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్‌తోపాటు ఇతర ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం కావడంతో కొంపల్లిలోని తేజస్విని నివాసంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తమ కూతురు ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.