పేషంట్‪ని తన్ని, తరిమేసిన డాక్టర్ వీడియో వైరల్

పేషంట్‪ని తన్ని, తరిమేసిన డాక్టర్ వీడియో వైరల్

ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగిని డాక్టర్ కొట్టి, కాళ్లతో తన్ని ఈడ్చి బయటకు తోసేశాడు. ఈ అమానుష సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జరిగింది. డాక్టర్ నిర్వాకం అంతా హాస్పిటల్ లోని సీసీటీవీలో రికార్డ్ అయింది.  ప్రస్తుతం ఆ వీడియో వైరల్‪గా మారింది. చికిత్స చేయించుకోవడానికి ఆకాష్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. డాక్టర్‌ ఆర్పీ సింగ్‌ను సంప్రదించాడు. మెడిసిన్ కోసం డాక్టర్ ని అడగగా.. ప్రిస్క్రిప్షన్ (మందుల చిట్టి) ఇచ్చి బయట కొనుక్కోమని డాక్టర్ సూచించాడు. పేషెంట్ ఆకాష్‌ అదేంటి అని ప్రశ్నించగా.. అతన్ని తీవ్రంగా కొట్టాడు. అతడ్ని కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రూమ్‌ నుంచి బయటకు లాక్కెళ్లాడు.

డాక్టర్‌ రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో జిల్లా కలెక్టర్‌ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడంతోపాటు రోగిని కొట్టిన డాక్టర్‌ ఆర్పీ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అయితే మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని రోగి తనను డిమాండ్‌ చేసినట్లు ఆ డాక్టర్‌ చెప్తున్నాడు. ఏదేమైనా ఈ వీడియో చూసిన వారు డాక్టర్ ని ఆగ్రహిస్తున్నారు.