ప్రొటోకాల్​ ఖర్చులుంటయ్​.. ఐదు వేలు ఇవ్వాల్సిందే

ప్రొటోకాల్​ ఖర్చులుంటయ్​..  ఐదు వేలు ఇవ్వాల్సిందే
  • పాస్​ బుక్​ కోసం వచ్చిన రైతును డిమాండ్ ​చేసిన గుట్ట తహసీల్దార్​
  • సోషల్ మీడియాలో  వైరల్​ అవుతున్న వీడియో

యాదగిరిగుట్ట, వెలుగు:  యాదగిరిగుట్టలో తహసీల్దార్ శోభన్ బాబు ఏకంగా ఆఫీసులోనే  ఓ రైతును రూ.5 వేలు లంచం అడుగుతున్న  వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్​ అయ్యింది.  గుట్టకు చెందిన ఓ రైతు తన ఎకరం భూమిని యాదగిరిగుట్టకే  చెందిన మరో రైతుకు అమ్మి రెండు రోజుల కింద తహసీల్దార్​ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించాడు. భూమిని కొన్న  సదరు రైతు పట్టా పాస్ బుక్  కోసం అఫీసులో తహసీల్దార్​ శోభన్ బాబును కలిశాడు.  ఎన్ని ఎకరాల భూమి కొన్నావని రైతుతో మాటలు ప్రారంభించిన తహసీల్దార్​.

 పాస్ బుక్  కోసం రూ.5 వేలు కావాలని డైరెక్టుగానే అడిగాడు.  దీనికి రైతు ‘సార్, మేము లోకల్ వాళ్లమై ఉండి కూడా రూ.5 వేలు ఇవ్వాలా’ అని అడగ్గా.. దీనికి తహసీల్దార్​ ‘మాకు ప్రొటోకాల్​, ఇంకా వేరే  ఖర్చులుంటాయి కదా..రూ.5 వేలు ఇవ్వాల్సిందే’ అని తేల్చి చెప్పాడు.  దీంతో రైతు పాస్ బుక్ తీసుకోకుండానే వెనుదిరిగాడు.  ఇదంతా రైతు తన ఫోన్ లో  రికార్డు చేశాడు.  ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ విషయమై రైతును  ‘వెలుగు’ సంప్రదించగా తహసీల్దార్​ రూ.5 వేలు లంచం అడిగింది నిజమేనని, మొదట తహసీల్దార్​ కాకుండా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారని చెప్పాడు. దీంతో  నేరుగా తహసీల్దార్​ శోభన్ బాబునే కలిసి డాక్యుమెంట్స్ అన్నీ  క్లియర్ గానే ఉన్నా డబ్బులు ఎందుకివ్వాలని అడిగితే ప్రొటోకాల్​ ఖర్చుల కోసం ఇవ్వాల్సిందేనని డిమాండ్​ చేశాడని తెలిపాడు.