ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తూ మోదీ ప్రభుత్వం నిత్యం రాజకీయాలతో తెలంగాణపై పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోంది. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ వంటి ఆకర్షణీయ నినాదాలిచ్చే బీజేపీ ఆచరణలో మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తోంది. ప్రతి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు కేటాయించకుండా ఒకవైపు చులకన చేస్తూ, మరోవైపు ప్రధాని మోదీ రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్‌లో పర్యటించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది.
నరేంద్ర మోదీ మే 10వ తేదీన హైదరాబాద్‌లో బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణపై వారు చూపుతున్న వివక్షకు జవాబు చెప్పాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలున్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపిన నరేంద్ర మోదీ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.
ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పట్టించుకోకుండా నిధుల కేటాయింపులో పక్షపాతం చూపించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుంటే సహకరించాల్సిన కేంద్రం అడ్డుగా నిలుస్తోంది. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 5.01 శాతం ఉండగా, న్యాయంగా ఇవ్వాల్సిన నిధులను కేటాయించడం లేదు. రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో కేంద్రానికి రూ.4.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తే, తిరిగి ఇవ్వడంలో కేంద్రం కొర్రీలు పెడుతోంది.
తెలంగాణపై వివక్ష
కేంద్ర బడ్జెట్‌లో, నిధులు కేటాయింపుల్లోనే కాకుండా అన్ని అంశాల్లోనూ తెలంగాణపై ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులను ఇవ్వలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అటకెక్కించారు.
రాష్ట్రంలో ఏ నీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా దక్కలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదు. లక్షలాది ఉద్యోగాల కల్పనకు దోహదపడే ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్, ఐఐఎంను మర్చేపోయారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మెట్రో రెండో దశ, రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం, రీజినల్ రింగ్ రైల్వే, హైదరాబాద్ డ్రైపోర్టు నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ హైవే, దీనికి రైల్వే కనెక్టవిటీ, సబర్మతి, గంగా, యమున తరహాలో మూసీ నది పునరుద్ధరణ, తెలంగాణకు సెమీ కండక్టర్ యూనిట్ కేటాయింపుకు తోడ్పాటు అందించాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరినా స్పందన లేదు.
హైదరాబాద్ వేదికగా కులగణనపై స్పష్టత ఇవ్వాలి
ఎవరెంతో వారికంత దక్కాలనే న్యాయమైన లక్ష్యంతో దేశంలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో కులగణన విజయవంతంగా పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా నిర్వహించిన కులగణనతో దేశవ్యాప్తంగా కూడా నిర్వహించాలనే ఒత్తిడి రావడంతో తలొగ్గిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన చేపడుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ సాధించిన విజయం. అయితే జనగణనలో కులగణన నిర్వహణపై పలు సందేహాలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా దీనిపై స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు రూపొందిస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడ్డుకున్న విధానం బహిరంగ రహస్యమే. ఇప్పటికైనా నరేంద్ర మోదీ దీనిపై స్పష్టత ఇస్తారని తెలంగాణ బడుగు, బలహీన వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
కేరళలో కాంగ్రెస్ చరిత్రాత్మక విజయం
సున్నితమైన అంశాలు, మనోభావాలను రెచ్చగొడుతూ అధికారం దక్కించుకునే బీజేపీ ఎత్తుగడలు దక్షిణాదిన, తెలంగాణలో పారవు. తెలంగాణలో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని చెప్పడానికి పలు ఎన్నికల్లో సాధించిన విజయాలే నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలు అందిస్తూ రెండింటిలో సమతుల్యం పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేదు. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పూర్తి అన్యాయం చేస్తుంది.
ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం హైదరాబాద్‌లో నరేంద్ర మోదీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. తెలంగాణలో మాత్రమే కాదు లౌకిక వాదానికి పెద్ద పీట వేస్తూ మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండే దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ కుట్రలు సాగవని ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మార్గదర్శంలో తెలంగాణ, కర్నాటకలో పార్టీ అందిస్తున్న సుపరిపాలన స్ఫూర్తితో మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో కాంగ్రెస్ చరిత్రాత్మక విజయం సాధించింది.
తమిళనాడులో కాంగ్రెస్ కీలకపాత్ర
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ బీజేపీ ఒక్క స్థానమే సాధించింది. దక్షిణ భారత్‌లో కాంగ్రెస్ పార్టీకి, ‘ఇండియా’ కూటమికి తిరుగులేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ఎంత హుందాగా వ్యవహరిస్తుందో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పరిణామాలే నిరూపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యాలయాలకు నిప్పు పెడుతూ బుల్డోజర్లతో దాడులు చేస్తుంటే, సంయమనంతో ఉండాలని, మమతా బెనర్జీనీ కించపరుస్తూ వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపివ్వడం గొప్ప అంశం.
తెలంగాణను అవమానించడమే పనిగా..
రాజకీయాలు కక్షపూరితంగా కాకుండా, ఎన్నికలకే పరిమితం చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం. సబ్బండ వర్గాలు పోరాడి సాధించుకున్న తెలంగాణపై బీజేపీ నేతలకు మొదటి నుంచి చిన్నచూపే ఉంది. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణ ఆవిర్భావంపై నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికతో ఇతర సందర్భాల్లో కూడా పలుమార్లు కించపర్చేలా మాట్లాడారు.
ఇటీవల లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మరో అడుగు ముందుకేసి దేశ విభజనతో పోలుస్తూ క్షమించరాని రీతిలో తెలంగాణపై అవమానకరంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందేమీ లేదు. ఎవరుపడితేవారు రాష్ట్రాన్ని అవమానిస్తున్నా వీరు చోద్యం చూస్తూ కూర్చోవడం దురదృష్టకరం.
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలి
తెలంగాణ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిందనేది బహిరంగ రహస్యమే. బీజేపీ నేతలు దీనికి సంబంధించి పలు విమర్శలు చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా కేంద్రం స్పందించకపోవడంతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అనిపిస్తోంది. దీనిపై మీరు స్పష్టత ఇస్తారని భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, సమాఖ్య స్ఫూర్తి, సామాజిక న్యాయం కీలక అంశాలతో రాష్ట్రం ముందుకు సాగుతోంది.
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రజలకు చేరువవుతున్న రాష్ట్రానికి కేంద్రం సహకరించాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా రాష్ట్ర హక్కులను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. తెలంగాణ అభివృద్ధిపై నరేంద్ర మోదీ కేంద్రం వైఖరిని స్పష్టం చేయాలి.
హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులపై సానుకూలంగా స్పందిస్తారని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. వికసిత్ భారత్ నినాదం ఎత్తుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ వికసిత్ కోసం కేంద్రం సహకారంపై స్పష్టత ఇవ్వాలి.
బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
