నలుగురు వ్యక్తులకు.. 4 కోట్ల మందికి మధ్య యుద్ధమిది: రేవంత్​

నలుగురు వ్యక్తులకు.. 4 కోట్ల మందికి మధ్య యుద్ధమిది: రేవంత్​
  • డిసెంబర్ 9న కాంగ్రెస్ సర్కార్​ వస్తది
  • 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తం
  • పాలకుర్తి సభలో పీసీసీ చీఫ్

జనగామ/పాలకుర్తి, వెలుగు :  కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతున్నదని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పేందుకు, దొరల పాలనను బొందపెట్టేందుకు ఇదే మంచి తరుణమని చెప్పారు. ‘‘కాంగ్రెస్ అంటే నమ్మకం.. కేసీఆర్ అంటే అమ్మకం. ఇప్పుడు ఎలక్షన్లు నమ్మకం, అమ్మకం మధ్యే’’ అని పేర్కొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా మామిడాల యశస్విని రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తర్వాత జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్​వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో ఎత్తేస్తామని ప్రకటించారు. ‘‘ఉచిత కరెంటుకు పేటెంట్ హక్కు కాంగ్రెస్‌‌‌‌దే. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం ఉచిత విద్యుత్ మీదే పెట్టాం. రూ.1,200 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తం” అని వెల్లడించారు. బీఆర్ఎస్ ​ప్రభుత్వం ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, దీన్ని నిరూపిస్తే వరంగల్‌‌‌‌లోని  జయశంకర్ విగ్రహం ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఒకవేళ 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు కేసీఆర్ నిరూపిస్తే తాను, పాలకుర్తి అభ్యర్థి నామినేషన్ వేయబోమని ప్రకటించారు. ‘‘ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన ఘనత  సోనియమ్మదైతే.. తెలంగాణలో ఉన్న భూములను అమ్ముకుంటున్న చరిత్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌దన్నారు. రేవంత్​ వస్తే తెలంగాణను అమ్ముకుంటడని కేసీఆర్ అంటున్నారు. గాయత్రి రవి, పార్థసారథి రెడ్డిలకు వందల కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్‌‌‌‌‌‌‌‌దే” అని ఆరోపించారు.

సర్పంచ్‌‌‌‌లు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలే

దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో పాలకుర్తి ప్రజలు తేల్చుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. లంబాడీ తండాల్లో, ఆదివాసీ గూడేల్లో ఆర్థిక భారంతో సర్పంచ్‌‌‌‌లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక్క సర్పంచుకు కూడా బిల్లులు ఇవ్వలేదని విమర్శించారు. ‘‘40 ఏండ్ల కింద డీలర్ గా ఉన్న దయాకర్​రావు ఈరోజు డాలర్ దయాకర్​రావు అయ్యాడు. వందల ఎకరాల భూములు, అమెరికాలో పెట్టుబడులు ఎలా వచ్చాయి? ఇక్కడ రూ.360 కోట్లతో చేపట్టిన   రిజర్వాయర్ పనుల్లో దయాకర్​రావు రూ.250 కోట్లు దోచుకున్నాడు. 2018లోనే దయాకర్​రావును ఓడించాలనుకున్నా. అప్పుడు గురితప్పింది. ఇప్పుడు తప్పదు” అని చెప్పారు. ఝాన్సీరెడ్డి అమెరికాలో స్థిరపడినా సొంత ప్రాంతానికి సేవ చేస్తున్నారని, ఇక్కడ హాస్పిటళ్లు, కాలేజీలు కట్టేందుకు 80 ఎకరాల భూమి కొంటే ఎర్రబెల్లి లిటిగేషన్​పెట్టారని ఆరోపించారు.  

శత్రువులతో కలిసి నాపై కుట్రలు చేసిండు

తాను జైలుకు వెళ్లడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్​రావేనని రేవంత్ ఆరోపించారు. శత్రువులతో చేతులు కలిపి తనపై కుట్రలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ దెబ్బతినడానికి ఎర్రబెల్లి కారణమని, ఆయ న్ను ఓడించేందుకు టీడీపీ అభిమానులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తమను విదేశీయులని ప్రచారం చేస్తున్నారని, తాను పాలకుర్తి ఆడబిడ్డనని మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ నేతలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.

కోకాపేట, ఓఆర్ఆర్ భూములు అమ్ముకున్నదెవరు?

సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రచార సభకు రేవంత్ హాజరై మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని, రేపు రాష్ట్రాన్ని అమ్ముతారని హరీశ్‌‌ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదం. కోకాపేట భూములు అమ్ముకున్నది మీ తాతనా? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూములు అమ్ముకున్నది మీ ముత్తాతనా?” అని మండిపడ్డారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదం సంతోష్ కుమార్‌‌‌‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తర్వాత సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి నీలిమ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార సభలో రేవంత్ మాట్లాడారు. మోండా మార్కెట్‌‌లో ఆలుగడ్డలు అమ్మిన తలసాని.. ఇయ్యాల సనత్ నగర్‌‌‌‌లో జనాల బతుకులను అమ్ముతున్నడని మండిపడ్డారు.

ఐటీ దాడులకు భయపడేది లేదు : పీసీసీ చీఫ్‌‌‌‌ రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్‌‌‌‌ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ పార్టీ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై దాడులు చేస్తూ తమను భయపెట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓటమి భయంతోనే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ కలిసి ఈ కుట్రలు చేయిస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పొంగులేటితో పాటు తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాతా రెడ్డి సహా కాంగ్రెస్ నేతల ఇండ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతమని ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ నేతల ఇండ్లపై ఐటీ రెయిడ్స్ ఎందుకు జరగడం లేదని నిలదీశారు. పొంగులేటి ఇంట్లో ఐటీ రెయిడ్స్, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు ఇంట్లో పోలీసుల సోదాలు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.