వారి కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలె

వారి కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలె

తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. స్వరాష్ట్ర సాధనలో అమరులైన వారి సంస్మరణార్థం తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు కోదండరాం గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల ఆత్మ శాంతి చేకూరాలని కోదండరాం బియ్యాన్ని సమర్పించారు. ఇవాళ తెలంగాణలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, వారి కుటుంబాలకు మేలు జరగాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు అమరుల కుటుంబాలకి ఆర్థిక సాయం అందలేదని ఆరోపించారు. ఆత్మహత్యలకి యత్నించిన వారికి, ఆరోగ్యం నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారి సంక్షేమం కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

అమరులకు సంబంధించి ఈరోజు ముఖ్యమైన రోజు అని TJS ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జన సమితి నిర్వహిస్తుందన్న ఆయన.. అమరుల త్యాగం పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. అమరుల జ్ఞాపకార్థం ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అమరులు చనిపోవడానికి కారణమైన సమాఖ్య వాదులు కూడా అసెంబ్లీ లో ఉన్నారని, అమరులు చనిపోతే పాడే మోయటానికి పోటీలు పడ్డ నాయకులు ఎందుకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు.