ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి..చిన్నారులు మృతి

ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి..చిన్నారులు మృతి

తూప్రాన్, వెలుగు: ఓ మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు తల్లిని కాపాడగా.. ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా తూప్రాన్‌‌ పట్టణంలో సోమవారం చోటు చేసుకున్నది. శివంపేట మండలం దంతాలపల్లికి చెందిన మమతకు మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన స్వామితో పదేండ్ల కింద పెండ్లి అయింది. 

వీరికి తేజస్విని (5), పూజిత (7) పిల్లలు. కొన్నేండ్ల కింద స్వామి చనిపోవడంతో మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఊరైన దంతాలపల్లిలోనే ఉంటున్నది. సోమవారం మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి తూప్రాన్‌‌ వెంకటరత్నాపూర్‌‌ శివారులోని హల్దీ వాగు వద్దకు వచ్చి నీటిలో దూకింది. గమనించిన స్థానికులు మమతను కాపాడగా, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న తూప్రాన్‌‌ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ రంగా కృష్ణ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, మమత ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తున్నది.