కుంటలో దూకి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

కుంటలో దూకి.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
  • కుటుంబ తగాదాలే కారణం

టేక్మాల్, వెలుగు: కుంటలో దూకి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. అల్లాదుర్గం సీఐ జార్జి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయిపల్లి గ్రామానికి చెందిన రాజుకు ఎనిమిదేళ్ల క్రితం రేగోడ్​మండలం గజ్వాడ గ్రామానికి చెందిన మహిళతో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల కిందట రాజు అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన రజితను రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు కూడా ఇద్దరు పిల్లలు కలిగారు. రాజు  ఉపాధి కోసం కొన్నేళ్లు హైదరాబాద్​లో ఉన్నాడు. కరోనా లాక్ డౌన్  టైంలో హైదరాబాద్ నుంచి  దాదాయపల్లికి వచ్చి ఇద్దరు భార్యలతో గ్రామంలోనే  ఉంటున్నాడు. కొన్నాళ్లుగా రాజు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి.  సోమవారం రాత్రి  రాజుకు, రెండో భార్య రజితకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రజిత(25) తన కొడుకు రిశ్వంత్(4), కూతురు రక్షిత(2)ను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని గచ్చుకుంటలో ఇద్దరు పిల్లల మృతదేహాలు తేలడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు ముందుగా ఇద్దరు పిల్లల డెడ్ బాడీలను ఒడ్డుకు చేర్చిన తరువాత, రజిత కోసం కుంటలో గాలింపు చేపట్టారు. కొద్దిసేపటి తరువాత రజిత డెడ్ బాడీ కూడా దొరికింది. కుటుంబ తగాదాల నేపథ్యంలోనే రజిత తన ఇద్దరు పిల్లలతో సహా కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించామని సీఐ చెప్పారు. రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. రజిత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె,  పిల్లల మృతికి భర్త రాజు కారణమని బంధువులు ఆరోపించారు. విచారణ జరిపి ముగ్గురి మృతికి కారణమైన రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.