తిండి లేక… వైద్యం అందక… చెట్టు క్రిందే ప్రాణం వదిలింది

తిండి లేక… వైద్యం అందక… చెట్టు క్రిందే ప్రాణం వదిలింది

క‌డుపు నింపుకోవ‌డానికి కీ చైన్ లు అమ్ముకుంటూ చెట్టు క్రిందే ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కాలాన్ని వెళ్ల‌దీస్తున్నారు ఆ భార్యాభ‌ర్త‌లు. గత మూడు నెలలుగా ఆ కుటుంబానికి చెట్టే ఇల్లుగా మారింది. అయితే లాక్ డౌన్ కార‌ణంగా ఎక్కడివాళ్ళు అక్క‌డే ఉండిపోవ‌డంతో చేసేందుకు ఏ పని లేక, తిన‌డానికి తిండి కూడా లేక ఆక‌లితో అల‌మటించి చివ‌ర‌కు ప్రాణాలు విడిచింది ఆ అభాగ్యురాలు. ఈ సంఘ‌ట‌న జగిత్యాల ప‌ట్ట‌ణంలోని వాణినగర్ లో జ‌రిగింది.

రోడ్డుపై కీ చైన్ లను అమ్ముకుంటూ ర‌మేష్, అత‌ని భార్య రమ్య జీవ‌నం సాగిస్తున్నారు. కొద్ది రోజులు గామ‌ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ర‌మ్య ఆక‌లితో అల‌మ‌టించి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. వారికి దిక్కు, మొక్కు లేకపోవడంతో స్థానికులు వార్డు కౌన్సిలర్ రాజ్ కుమార్ కు సమాచారం అందించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో అక్కడకు చేరుకున్న రాజ్ కుమార్.. వారి పరిస్థితి తెలుసుకుని, చేసేదేమీలేక ఆమె మృతదేహాన్ని పారిశుద్ధ్య కార్మికులతో తీసుకువెళ్లి ఖననం చేయించారు. పారిశుధ్య కార్మికులే కుటుంబ సభ్యులుగా ర‌మ్య‌ మృతదేహాన్ని తీసుకువెళ్లి ఖననం చేయడం పట్ల వాణినగర్ ప్రాంతవాసులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులను అభినందించారు

ర‌మేష్ కుటుంబంతో పాటు మ‌రికొన్ని చిన్నా చిత‌కా కుటుంబాలు చెట్టు కిందే జీవనం సాగిస్తున్నారని, వీరిని ఎన్ని మార్లు మందలించినప్పటికీ ఆ చెట్టుకింది నుంచి మాత్రం వెళ్లడం లేదని స్థానికులు అంటున్నారు. ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా లేకున్నా అక్కడే జీవనం గడుపుతుండడం పట్ల సంబంధిత ధర్మశాల అధికారులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకోలేద‌ని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబాల‌కి ప్రభుత్వం తరఫున విచారించి, ఎక్కడైనా ఓ గూడు చూపించి అక్కడికి తరలించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.