నిజామాబాద్, వెలుగు : కుల బహిష్కరణ చేసిన విషయంపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ మహిళ కలెక్టరేట్లో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఆలూరు మండలం డీకంపల్లికి చెందిన చిన్మల నల్లా భర్త నుంచి విడిపోయి కూతురితో ఉంటోంది. వీరి ఇంటి పక్కన ఉండే బంధువు కుటుంబంతో గొడవలు జరుగుతున్నాయి.
కుల పెద్దలు పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా చిన్మల నల్లా వినకపోవడంతో కులం నుంచి బహిష్కరించారు. ఈ విషయంపై గతంలోనే మాక్లూర్ పోలీస్ స్టేషన్‌తో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఎవరూ స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ సోమవారం పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌కు వచ్చింది. పోలీసులు గమనించి మహిళను అడ్డుకొని డబ్బాను లాక్కున్నారు.
