బాల్కొండ, వెలుగు: ఇంటి స్థలం కోసం ఓ వృద్ధుడు మూడేండ్లుగా న్యాయపోరాటం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో భరత్ భూషణ్ కు ఇల్లు ఉండగా రోడ్డు వెడల్పులో భాగంగా వీడీసీ సభ్యులు రెండేండ్ల క్రితం ఆ ఇంటిని కూల్చేందుకు సిద్ధమవగా.. అందుకు ఒప్పుకోని వృద్ధుడు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు.
కోర్డు ఉత్తర్వులను పట్టించుకోని వీడీసీలు రెండేండ్ల క్రితం ఆ ఇంటిని కూల్చేశారు. అంతేకాకుండా మిగతా స్థలం ఆక్రమించుకున్నారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేయగా.. విత్ డ్రా చేసుకోవాలని బలవంతం చేస్తూ అట్రాసిటీ కేసు పెట్టారని బాధితుడు వాపోయాడు.
శనివారం మరోసారి బాల్కొండ పోలీసులను ఆశ్రయించాడు. తనను బెదిరించి స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయాడు. ఇదే విషయంపై గత నెల 30న కంప్లైంట్ చేశానని, ఉన్నతాధికారుల జోక్యంతో 20 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పాడు. తనకు నష్టపరిహారం చెల్లించి, న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.
