ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేస్తం

ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేస్తం
  •     తీర్పుపై భగ్గుమన్న మాల సంఘాలు
  •     ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన..తీర్పు పత్రాలు దహనం
  •     మాల సంఘాల ప్రతినిధులు అరెస్ట్

ముషీరాబాద్/ బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల సంఘాలు ఆందోళన చేపట్టాయి. శుక్రవారం సాయంత్రం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు మాల సంఘాల ప్రతినిధులు భారీగా చేరుకొని సుప్రీంకోర్టు తీర్పు పత్రాలను దాహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ తీర్పులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హస్తం ఉందని ఆరోపించారు. 

ట్యాంక్​బండ్​పై భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య, మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు సుధాకర్, బేర బాలకృష్ణ మాట్లాడుతూ గతంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చిందని, కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ న్యాయవాదులను లొంగదీసుకుని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేట్టు చేశారని ఆరోపించారు. 

బీజేపీ ప్రభుత్వం.. ప్రధాని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, చంద్రబాబు వెనుక ఉండి వర్గీకరణ అంశాన్ని నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8, 9న చలో ఢిల్లీ చేపట్టి ధర్నాలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న మాలాలను ఐక్యం చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాల ఎంపీ ఎమ్మెల్యేలను కూడగట్టి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంతవరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 

రిజర్వేషన్లకు ఆటంకం: జి.చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లకు ఆటంకం కలిగించేలా, ఆర్టికల్ 341కు విరుద్ధంగా ఉందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. హైదరాబాద్ హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో చెన్నయ్య మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని దళిత ఆదివాసీ సమాజాన్ని అస్థిరపరిచే చర్యలకు పూనుకున్నదని అన్నారు. ఈ నెల 8, 9, 10వ తేదీల్లో ఢిల్లీలో నిరసన చేపడతామని తెలిపారు.