
పోలీసుల పాత్రపైనా అనుమానాలు
చితక్కొట్టారంటున్న కుటుంబ సభ్యులు
జడ్చర్ల ఘటన మరువక ముందే మరోటి
నారాయణపేట టౌన్, వెలుగు: ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. అడ్డు వచ్చిన వారిని బెదిరించడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రాణాలు తీసేందుకూ వెనకాడడం లేదు. జడ్చర్లలో ఓ వ్యక్తిని లారీతో తొక్కించి యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన ఘటన మరువక ముందే మరోటి జరిగింది. కాకపోతే అది హత్య.. ఇది ఆత్మహత్య. మాఫియా బెదిరింపులతో నారాయణపేట జిల్లా భైరంకొండ గ్రామానికి చెందిన సాయినాథ్(23) ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో పోలీసుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బెదిరింపులకు పాల్పడ్డ వారే ఇతనిపై కంప్లైంట్ ఇవ్వడంతో చితక్కొట్టినట్లు తెలుస్తోంది. యువకుడి భార్య లింగమ్మ కూడా తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు.
ఫ్రెండ్ కోసం వెళ్లడంతో..
భైరంకొండకు చెందిన సాయినాథ్(23) గత నెల 28న జలాల్పూర్లో ఉన్న తన మిత్రుడిని తీసుకొచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. కర్నాటక బార్డర్ ప్రాంతంలో ఆగి ఉండగా.. ఇసుక మాఫియాకు చెందిన కొందరు వచ్చి ఇతనితో గొడవ పడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా అనుమానించి బెదిరించారు. ఈ విషయంలో కర్నాటక రాష్ట్రం సైదాపూర్‌కు చెందిన మల్లయ్య సాయినాథ్ తన బంగారు గొలుసును దొంగలించారని పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సాయినాథ్‌ను స్టేషన్‌కు పిలిపించుకుని విచారించారు. ఓ ఆఫీసర్ రూంలో ఉంచి ముగ్గురు పోలీసులు చితక్కొట్టిన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన ఇద్దరు గ్రామపెద్దలు లాయర్‌తో వెళ్లి ఫిర్యాదుదారుడితో సెటిల్మెంట్ చేసుకుంటామని సాయినాథ్‌ను ఇంటికి తీసుకెళ్లారు. బెదింపులు, బంగారం దొంగతనం వేయడంతో మనస్తాపం చెందిన సాయినాథ్ ఈనెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. దీంతో ఇసుక మాఫియా బెదిరింపులతో పాటు పోలీసులు కూడా కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు గురువారం ఆస్పత్రిలో ఆందోళనకు దిగేందుకు ప్రయత్నించారు. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు రాజకీయ నాయకులను పిలిపించి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. అయినా సాయినాథ్ భార్య లింగమ్మ తన భర్త ఇసుక మాఫిక బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేసింది.
మరో చోట రైతుకు బెదిరింపులు
పది రోజుల క్రితం ఓ పోలీసు ఆఫీసర్ అసిస్టెంట్( హోంగార్డు ) నారాయణపేట జిల్లా కేంద్రం దగ్గరలో ఉన్న పొలం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా రైతు అడ్డుకున్నాడు. దీంతో అతను కేసు పెట్టించి లోపలేయిస్తాయని బెదిరింపులకు దిగడంతో ఆ సమయానికి ఊరుకున్నాడు. గ్రామస్తుల ధైర్యంతో రెండ్రోజుల తర్వాత జిల్లా పోలీసు ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన ఆఫీసర్ భైరంకొండ యువకుడిని కొట్టిన దాంట్లో ఈ హోంగార్డు పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించి వెంటనే ఇతర పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే ఇతని పైఆఫీసర్‌ను కూడా మందలించటంతో సెలవులో వెళ్లినట్లు తెలిసింది. భైరంకొండ కేసు కూడా ఈ పీఎస్ పరిధిలోనిదే కావడం గమనార్హం.
ఓ శాఖ పెత్తనంతోనే..!
జిల్లాలో ఓ శాఖ పెత్తనంతో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. మామూళ్ల మత్తులో ఉన్న ఆ శాఖ సిబ్బంది కనుసన్నల్లోనే వ్యాపారం నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాళ్లు రాత్రిపూట డ్యూటీల కోసం కార్యాలయంలో వాగ్వాదాలు చేసుకున్న ఘటనలు కూడా లేకపోలేదు. ఎవరైనా అడ్డుకుంటే వీరి అండతోనే మాఫియా దాడులు చేస్తోంది. అయినా మైనింగ్, రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
ఎవరినీ కొట్టలేదు
బంగారం దొంగతనం చేశాడనే ఫిర్యాదు మేరకు సాయినాథ్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేశాం. సిబ్బంది ఎవరిపై కూడా చేయిచేసుకోలేదు. ఇది ఆరోపణ మాత్రమే. సాయినాథ్ భార్య ఫిర్యాదు మేరకు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాం.– చంద్రమోహన్, పేట ఎస్సై