కారుతో పాటు యువకుడు జలసమాధి..కరీంనగర్ లో మిస్టరీగా మారిన రాజు మరణం .?

కారుతో పాటు యువకుడు జలసమాధి..కరీంనగర్ లో  మిస్టరీగా మారిన రాజు మరణం .?

కరీంనగర్ లో ఓ యువకుడు బావిలో జలసమాధి కావడం కలకలం రేపుతోంది. జనవరి 5న కనిపించకుండా పోయిన యువకుడు కారుతో పాటు బావిలో శవమై కనిపించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 సంగెం రాజు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో కారుతో సహా బావిలో పడిపోయినట్లు గుర్తించి మృత దేహాన్ని  బయటకు తీశారు. మానకొండూరు మండలం వేగురుపల్లి దగ్గర  బావిలోంచి కారును బయటకు తీసేందుకు పోలీసులు,  ఫైర్స్ సిబ్బంది, రెస్క్యూ టీం దాదాపు 14 గంటల పాటు శ్రమించారు. చివరకు కారుతో సహా అందులోనే కుళ్ళిపోయిన రాజు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. 

 కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరుకు చెందిన రాజు జనవరి  5న హైదరాబాద్ నుంచి కారులో తన స్వగ్రామానికి  బయలుదేరాడు. కానీ ఇంటికి మాత్రం చేరుకోలేదు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందిన తల్లి స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలింపు చేపట్టిన మానకొండూరు పోలీసులు మానకొండూరు మండలంలోని వేగురుపల్లి దగ్గర సిగ్నల్స్ కట్ అయినట్టుగా గుర్తించారు. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్ద కారు టైర్ల అచ్చులు ఆధారంగా జనవరి 12న  మధ్యాహ్నం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. భారీ సైజు జెసిబి తో పాటు, ఫైర్ సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. జెసిబి సాయంతో వెతికినప్పుడు మొదట కారుకు సంబంధించిన కొన్ని విడిభాగాలు మాత్రమే బయటికి రాగా.. ఆ తర్వాత 5 మోటార్ల సాయంతో బావిలో నుంచి నీటిని తోడి వేసారు. చివరకు రాత్రి 11:30 గంటల సమయంలో కారును గుర్తించి బయటకు తీశారు. అందులోనే కుళ్ళిపోయిన స్థితిలో రాజు మృతదేహం గుర్తించారు. సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి బాడీని బంధువులకు అప్పగించారు.

 అయితే గతంలో రాజు తండ్రి కూడా ఇదే విధంగా అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. ఇప్పుడు రాజు మరణం మిస్టరీగా మారింది. ప్రమాదవశాత్తు కారు బావిలో పడిపోయిందా? లేదా మరి ఏదైనా కారణం ఉందా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.