ఫోన్​ కొనియ్యలేదని అక్క పెళ్లికి దాచిన గోల్డ్, క్యాష్ కొట్టేసిండు

ఫోన్​ కొనియ్యలేదని అక్క పెళ్లికి దాచిన గోల్డ్, క్యాష్ కొట్టేసిండు

గజ్వేల్, వెలుగు: ఫోన్​ అడిగితే కొనియ్యలేదని అక్క పెళ్లికి దాచిన బంగారం, డబ్బును దొంగిలించాడు ఓ తమ్ముడు. గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వర రావు వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్​మండలం తిగుల్​కు చెందిన బొర్రల మహాంకాళమ్మ భర్త ఆరేండ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు కాగా పెద్ద కూతురుకు పెళ్లయ్యింది. ముగ్గురూ ఆడ పిల్లలు కావడంతో భర్త చనిపోయాక మహాంకాళమ్మ తన అక్క కొడుకు అనిల్​ను దత్తత తీసుకుంది. అప్పటి నుంచి అనిల్​చిన్నమ్మ వద్దే ఉంటున్నాడు. ఈ నెల 9న రెండో బిడ్డ పెళ్లి కోసం దాచిన బంగారం, డబ్బు, పెద్ద బిడ్డ నగలను ఇంట్లోని బీరువాలో దాచి మహాంకాళమ్మ మర్కూక్​లోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఇద్దరు ఆడ పిల్లలు పొలం పనికి వెళ్లారు. తిరిగొచ్చి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి ఉంది. అందులోని 17 తులాల గోల్డ్, రు.1.35 లక్షలు కనిపించలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు అనిల్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ యువకుడు ఇటీవల చిన్నమ్మను ఫోన్ ​అడిగాడు. కొనివ్వకపోవడంతో బీరువాలోని డబ్బు, నగలను దొంగిలించి ఇంటి సమీపంలోని గడ్డి వాములో దాచిపెట్టాడు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.