- మహిళనని నమ్మించి ఓ యువకుడు
- పెళ్లి పేరుతో రూ. 11.17 లక్షలు వసూలు
- ఏపీకి చెందిన వ్యక్తి ..
- హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల అదుపులో నిందితుడు
బషీర్‌బాగ్, వెలుగు : మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేసుకొని, మహిళనంటూ నమ్మిస్తూ, పెట్టుబడి పేరుతో పలువురిని మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు పెండ్లి కోసం తన ప్రొఫైల్‌ను ఓ మ్యాట్రిమోని సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో ‘అంజలి కందుల’ అనే పేరుతో అతడికి వాట్సప్ మెసేజ్ వచ్చింది.
తాను యూకేలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని, తెలుగు యువకుడిని పెండ్లి చేసుకోవాలన్నదే తన కోరిక అని చెప్పారు. కొన్ని రోజుల పాటు చాటింగ్ చేయడంతో పాటు మహిళల గొంతుతో మాట్లాడారు. తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ చెప్పడంతో నిజమేనని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ.11,17,834 ఇన్వెస్ట్ చేశాడు.
ఆన్‌లైన్ వ్యాలెట్‌లో లాభాలు చూపిస్తున్నా.. వాటిని విత్ డ్రా చేసుకోవడం వీలు కాకపోగా.. యువకుడి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. మహిళ పేరుతో నమ్మించింది విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్ (32)గా గుర్తించారు.
ఇతడు ఉపాధి కోసం కంబోడియా వెళ్లి అక్కడ సైబర్ నేరగాళ్ల ముఠాతో చేతులు కలిపి సుమారు 500 నకిలీ సిమ్‌కార్డుల సాయంతో అకౌంట్లు తెరిచి, మహిళల గొంతుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో ఈ నెల 24న కంబోడియా నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రసన్నకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, బాధితుల సొమ్ము ఎక్కడికి మళ్లించారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
