హైదరాబాద్‎లో దారుణం: బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకుడు

హైదరాబాద్‎లో దారుణం: బంగారం కోసం ఇంటి ఓనర్‏ను చంపి గోదావరిలో పడేసిన యువకుడు

హైదరాబాద్: హైదరాబాద్‎లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత (65) అనే వృద్ధురాలు ఒంటరిగా నివస్తోంది. కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లి చెందిన ఎం.అంజిబాబు(33) అనే క్యాబ్ డ్రైవర్ సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. 

యజమానురాలి బంగారు నగలపై అంజిబాబు కన్నుపడింది. సుజాత ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని నగలు కొట్టేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే ఎవరూ లేని సమయంలో సుజాతను హత్య చేసి నగలు దొంగలించాడు. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన సుజాత సోదరి ఆమె ఇంటికి వచ్చింది. సుజాత కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సుజాత ఇంట్లో అద్దెకు ఉండే అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు తమదైన స్టైల్లో ఇంటరాగేట్ చేయడంతో.. బంగారం కోసం సుజాతను హత్య చేసి, తన స్నేహితులు యువరాజు(18), దుర్గారావు(35)ల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని అంజిబాబు నేరం అంగీకరించాడు. దీంతో హత్యకు పాల్పడిన అంజిబాబుతో పాటు సహకరించిన ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు.