షాద్‌నగర్, వెలుగు : ఉరి వేసుకొని ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో.. మనస్తాపానికి గురైన ప్రియుడు యువతి ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిహార్‌కు చెందిన నవనీత్ దత్త అనే వ్యక్తి నాలుగేండ్ల కింద కుటుంబంతో సహా కొత్తూరుకు వచ్చాడు.
నవనీత్ దత్త ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అతడి పెద్దకుమార్తె అనామిక (21) స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న ధనుంజయ్ (25) అనే యువకుడితో పరిచయమైంది. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అనామిక మూడు రోజులుగా ఉద్యోగానికి రాకపోవడంతో ధనుంజయ్ సోమవారం ఆమె ఇంటికి వచ్చాడు. అతడు వచ్చి చూసే సరికే అనామిక ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది. దీంతో మనస్తాపానికి గురైన ధనుంజయ్ యువతి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.
మధ్యాహ్నం అనామిక కుటుంబ సభ్యులు వచ్చిచూసే సరికే ఇద్దరూ చనిపోయి కనిపించారు. యువతి తండ్రి నవనీత్ దత్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
