తండ్రి మృతితో మనోవేదనకు గురై.. యువకుడు సూసైడ్

తండ్రి మృతితో మనోవేదనకు గురై.. యువకుడు సూసైడ్
  •     20 రోజుల క్రితం నిమ్స్​లో పలు నిర్మాణాలకు కూలీగా వచ్చాడు
  •     మృతుడు జార్ఖండ్ ​వాసి

పంజాగుట్ట, వెలుగు: తండ్రి మృతిచెందడం.. మాట్లాడలేని తల్లి, పదేండ్ల సోదరుడి బాధ్యత.. దీనికితోడు సొంత రాష్ట్రాన్ని వదిలొచ్చి కూలీ పని చేయడం.. ఇవన్నీ అతన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఇన్ని కష్టాల మధ్య బతకలేననుకున్నాడో ఏమో ఉరేసుకొని తనువు చాలించాడు జార్ఖండ్​రాష్ట్రానికి చెందిన యువకుడు.

హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్​లోని గర్వా జిల్లాకు చెందిన బికాశ్​కుమార్(18) తండ్రి గతేడాది అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో మూగ తల్లి, పదేండ్ల సోదరుడి పోషణ బాధ్యత బికాశ్​కుమార్​పై పడింది. తన సమీప బంధువు హైదరాబాద్​లోని నిమ్స్​లో చేపడుతున్న నూతన నిర్మాణాల్లో కూలీగా చేస్తున్నాడు.

20 రోజుల క్రితమే బికాశ్​కుమార్​అతని వద్దకు వచ్చి పని చేస్తున్నాడు. కానీ, తండ్రి చనిపోవడం, తల్లి, తమ్ముడి పరిస్థితితో నిత్యం మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి తాను పనిచేసే చోట స్నానాల గదిలో ఇనుప రాడ్డుకు లుంగీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.