ఆస్పత్రిలో పెళ్లి..పెద్ద మనసు చాటుకున్న వరుడు

ఆస్పత్రిలో పెళ్లి..పెద్ద మనసు చాటుకున్న వరుడు

పెండ్లి పీఠలపై జరగాల్సిన వివాహం ఆసుపత్రిలో జరిగింది. అక్కడ పెండ్లి మండపం లేదు.. భాజాభజంత్రీలు లేవు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు... నిరాడంబరంగా ఆసుపత్రిలో పెళ్లి జరిగింది. శస్త్ర చికిత్స జరిగిన ఆసుపత్రిలో ని బెడ్ పైనే పెళ్లికూతురుకు పెళ్లికొడుకు తాళికట్టాడు.  

పెళ్లికూతురుకు ఏమైంది..? 

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలానికి చెందిన బానోథ్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయమైంది. ఇవాళ (ఈనెల 23న) లంబాడిపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే.. ఉన్నట్టుండి వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. 

ఈ విషయం పెండ్లి కుమారుడు తిరుపతికి తెలియడంతో కంగారుపడ్డాడు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని తిరుపతి సంక్పలించాడు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబ సభ్యలకు చెప్పి.. వారిని ఒప్పించాడు. దీంతో పెద్దలందరూ పెళ్లికి ఒప్పుకోవడంతో శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు కూడా విషయం చెప్పాడు. వరుడు తిరుపతి మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు.  బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి తాళి కట్టాడు. ఇద్దరు పూల దండలు మార్చుకుని దంపతులుగా మారారు.