పెళ్లికి పిల్లను చూసిపెట్టాలని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువకుడు

పెళ్లికి పిల్లను చూసిపెట్టాలని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువకుడు

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజీమ్‌ మన్సూరి. వయసు 26. పెళ్లీడొచ్చినా, వధువు దొరకట్లేదని బాధపడుతున్నడు. కారణం.. తన హైట్‌. అతడి ఎత్తు రెండడుగుల మూడు అంగుళాలు మాత్రమే. ఇలా హైట్‌ తక్కువ ఉండటం అజీమ్‌కు సమస్యగా మారింది. కొంతకాలంగా పెళ్లి చేసుకుందామని చూస్తున్నా, తక్కువ హైట్ వల్ల ఏ అమ్మాయీ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన అజీమ్‌, తన పెళ్లి విషయంలో సాయం చేయాల్సిందిగా పోలీసుల్ని కోరాడు. దీనికోసం ఏకంగా యూపీలోని షామ్లీ జిల్లాలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తను ఒక చిన్న వ్యాపారం చేస్తూ, కుటుంబాన్ని పోషించేంత సంపాదిస్తున్నానని, అయినప్పటికీ హైట్‌ తక్కువ ఉండటం సమస్యగా మారిందన్నాడు. తన కుటుంబం కూడా పెళ్లి విషయం పట్టించుకోవడం లేదు కాబట్టి తనకు వధువును వెతికిపెట్టి సాయం చేయాలని పోలీసుల్ని కోరాడు. అలాగే బాగా చదువుకున్న అమ్మాయి కావాలని కూడా చెప్పాడు. ‘పోలీసులు ప్రజలకు సేవకులు. అన్ని విషయాల్లో సాయం చేస్తారు. కాబట్టి, పెళ్లి విషయంలో కూడా హెల్ప్‌ చేస్తారనే నమ్మకంతో పోలీసుల్ని సాయం అడిగా’ అని అజీమ్​ చెప్పాడు. ప్రస్తుతం అజీమ్‌కు హెల్ప్‌ చేసేందుకు సల్మాన్‌ ముందుకొచ్చినట్లు సమాచారం. అజీమ్‌ ను సల్మాన్‌ ముంబై ఆహ్వానించినట్లు తెలుస్తోంది.