హైదరాబాద్ లో అపెండిక్స్ ఆపరేషన్ చేశాక యువతి మృతి

హైదరాబాద్ లో  అపెండిక్స్ ఆపరేషన్ చేశాక యువతి మృతి
  • శ్రీ సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్​డాక్టరే కారణమని ఆరోపణ
  • దవాఖాన ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన

నాచారం, వెలుగు: ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో అపెండిక్స్​ ఆపరేషన్​ చేయించుకున్న యువతి మృతిచెందింది. డాక్టర్​శస్త్రచికిత్స సరిగా చేయలేదంటూ కుటుంబసభ్యులు ఆమె మృతదేహంతో దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా సూళ్లూరుకు చెందిన శైలజ(22)కు తీవ్రమైన  కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 13న నాచారం స్నేహపురి కాలనీలోని శ్రీ సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ లో చేర్పించారు. డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆమెకు అపెండిక్స్​గా నిర్ధారించారు. 

మరుసటిరోజు ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేశారు. అదేరోజు రాత్రి 8 గంటలకు శైలజ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉండటంతో ఉప్పల్ లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు పంపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సోమవారం ఉదయం సికింద్రాబాద్​లోని మరో దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి 7 గంటలకు శైలజ మృతిచెందింది. శ్రీ సత్య లాప్రోస్కోపిక్ డాక్టర్​ఆపరేషన్​సరిగా చేయకపోవడం వల్లే శైలజ చనిపోయిందని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. అర్ధరాత్రి ఆమె మృతదేహంతో హాస్పిటల్​ఎదుట ఆందోళన చేపట్టారు. డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.