కొత్త ఓటు నమోదుకు ఏడాదికి నాలుగు సార్లు ఛాన్స్

కొత్త ఓటు నమోదుకు ఏడాదికి నాలుగు సార్లు ఛాన్స్

ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్... ఎన్నికల సంఘం సూచనల మేరకు సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓటు హక్కు రిజిస్ట్రేషన్, ఓటింగ్ ప్రక్రియను మరింత సమ్మిళితంగా మార్చడం, ఎలక్షన్ కమిషన్ కు మరిన్ని అధికారాలు కల్పించడం, డూప్లికెట్లను నిరోధించడం లక్ష్యంగా సంస్కరణలు తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంట్లో భాగంగానే... ఆధార్-ఓటర్ ఐడీ కార్డులను లింక్ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇది వాలంటరీ బేసిస్ లో ఉంటుంది స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ పైలట్ ప్రాజెక్టులను కండక్ట్ చేయనుంది.

ఇక 18 ఏళ్లు పైబడి కొత్తగా ఓట్ రిజిస్టర్ చేసుకునేవారికి... అవకాశాలను మరింత ఈజీ చేసింది. ఏడాదిలో నాలుగు డిఫరెంట్ కటాఫ్ డేట్లతో ఏడాదికి నాలుగుసార్లు రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఏడాదికి ఒకసారి మాత్రమే రిజిస్టర్ చేసుకునే వీలుంది. ఇక మూడో సంస్కరణ విషయానికొస్తే... సర్వీస్ ఆఫీసర్ల భార్యలకు మాత్రమే ఉన్న పోస్టల్ బ్యాలెట్ హక్కును జెండర్ న్యూట్రల్ గా మార్చింది. కొత్త రీఫామ్ ప్రకారం... మహిళా సర్వీస్ ఆఫీసర్ల భర్తలు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక ఏ బిల్డింగ్ లో అయినా ఓటింగ్ నిర్వహించే హక్కును ఎలక్షన్ కమిషన్ కు కట్టబెట్టింది కేబినెట్. ఎన్నికల సంస్కరణ బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్రం.