
- అది కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే: సుప్రీం కోర్టు
- ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం
- పౌరసత్వ గుర్తింపునకు రేషన్, ఎలక్షన్ కార్డులూ చెల్లవ్
- వాస్తవ గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి ఆదేశం
- ‘బిహార్ ఓటర్ లిస్ట్(సర్)’పై దాఖలైన పిటిషన్లపై విచారణ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు ఐటెండిఫికేషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ సిటిజన్ షిప్కు ఆధార్ కార్డు.. కచ్చితమైన ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో వివిధ సేవలు పొందేందుకు ఆధార్.. ఓ గుర్తింపు కార్డుగానే ఉంటుందని తేల్చి చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే, దీనిని స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
బిహార్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఎలక్టోరల్ రోల్స్ వివాదం నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ నేతృత్వంలోని బెంచ్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ‘సర్’కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆధార్ కార్డు, ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డులను పౌరసత్వ రుజువుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
‘‘కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్నది కరెక్టే. ఈసీ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. పౌరసత్వం జారీకి ఆధార్ ప్రామాణికం కాదు. ఎన్నికల గుర్తింపు కార్డు, రేషన్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకోలేం. దీనిని కచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ అధికారం ఉందా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈసీకి అధికారం లేకపోతే ఏ సమస్య ఉండదు. కానీ.. వారికి అధికారం ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆధార్ యాక్ట్, 2016లోని సెక్షన్ 9 ప్రకారం.. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు ధృవీకరణ కోసం మాత్రమే. పౌరసత్వ ధృవీకరణకు కాదు’’అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
‘సర్ ’లో ప్రొసీజరల్ అసమానతలు: కపిల్ సిబల్
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ‘‘ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది ఓటర్లు ఇబ్బందిపడ్తారు. వారి పేర్లు ఓటర్ లిస్టు నుంచి తొలగించే ప్రమాదం ఉంది. వారు ఓటు హక్కు కోల్పోతారు. బిహార్‌లో చేపడుతున్న సర్ ప్రక్రియలో ప్రొసీజరల్ అసమానతలుగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లను అనర్హులుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. 1950 తర్వాత ఇండియాలో పుట్టిన వారందరూ దేశ పౌరులుగా గుర్తించాలి. కానీ, ‘సర్’ ప్రక్రియలో ఓటర్లను తొలగించడం చాలా అన్యాయం. ప్రాపర్ డాక్యుమెంట్లు సమర్పించని వారి ఓట్లు పోతాయి. 2003 ఓటర్ల జాబితాలో చేరిన ఓటర్లు సైతం ఇప్పుడు పత్రాలు సమర్పించాల్సి వస్తున్నది. ఒకవేళ సమర్పించకపోతే ఓటు హక్కు కోల్పోతారు.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం 7.24 కోట్ల మంది డాక్యుమెంట్లు సమర్పించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు సరిగ్గా వర్క్ చేయడం లేదు. బతికి ఉన్న వాళ్లను చనిపోయినవారి జాబితాలో చేరుస్తున్నారు. 65లక్షల మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారు. వీరందరిపై సరైన విచారణ చేపట్టకుండానే మరణాలు, వలస పేరిట డిలీట్ చేశారు. ఎలాంటి సర్వే చేపట్టలేదని ఈసీ సైతం అఫిడవిట్ దాఖలు చేసింది’’అని కపిల్ సిబల్ కోర్టుకు వివరించారు. ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఈసీ చెప్పిందని, కానీ.. వారు బతికే ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో ఘటనలో బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు ప్రకటించారని కోర్టుకు చెప్పారు.
ఏ పౌరుడి సిటిజన్ షిప్ రద్దు చేయట్లేదు: ఈసీ తరఫు అడ్వకేట్
ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ రాకేశ్ ద్వివేదీ వాదనలు వినిపిస్తూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ ఎలక్టోరల్ రోల్స్‌ను రివిజన్ చేయడం ద్వారా ఆధార్, ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డులు పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లుగా చట్టబద్ధతమైనవి కాదని తెలిపారు. ‘‘ఈ డాక్యుమెంట్లు గుర్తింపు కార్డులుగా ఉపయోగిస్తున్నప్పటికీ పౌరసత్వాన్ని నిర్ధారించలేవు. ఈ ప్రక్రియలో ఏ పౌరుడి సిటిజన్‌షిప్‌ను రద్దు చేయడం లేదు. కేవలం ఓటింగ్ అర్హతను మాత్రమే నిర్ధారిస్తున్నాం. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్లు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దొచ్చు. ప్రస్తుతం విడుదల చేసింది కేవలం ముసాయిదా జాబితా మాత్రమే”అని రాకేశ్ ద్వివేది కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘వాస్తవాలు, గణాంకాలతో ఈసీ సిద్ధంగా ఉండాలి. సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? గతంలో నమోదైన మరణాల సంఖ్య? ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య? వంటి వివరాలన్నీ రెడీగా ఉంచుకోవాలి. సామూహికంగా ఓటర్లను తొలగిస్తే వెంటనే జోక్యం చేసుకుంటామని జులై 29నే చెప్పినం. ఇండియన్ సిటిజన్ షిప్కు ఆధార్ కార్డు.. కచ్చితమైన ప్రూఫ్ కాదన్న ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం’’అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.