20 నెలల్లోనే ఎయిర్ పోర్ట్..

20 నెలల్లోనే ఎయిర్ పోర్ట్..

అయోధ్య: ఉత్తరప్రదేశ్​లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను రికార్డు టైమ్ లో  కేవలం 20 నెలల్లోనే పూర్తి చేసినట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్ సంజీవ్ కుమార్ వెల్లడించారు.  దీనికి 'మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్  ఎయిర్‌పోర్ట్' గా పేరు పెట్టినట్లు చెప్పారు. గతేడాది ఏప్రిల్‌లో అయోధ్య విమానాశ్రయం నిర్మాణానికి  ఒప్పందం జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో  కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం.. విమానాశ్రయాన్ని  మొత్తం 821 ఎకరాల్లో  రూ. 350 కోట్లతో  ఏఏఐ  అభివృద్ధి చేసింది. 

రన్‌వే  మొత్తం పొడవు 2200మీ. కాగా.. ఏ-321 రకం విమానాల నిర్వహణకు ఈ  రన్‌వే అనుకూలంగా ఉంటుంది. ఎనిమిది ఏ321 రకం విమానాలను పార్కింగ్ చేయడానికి అనువైన ఆప్రాన్ కూడా నిర్మించారు. 250 కేడబ్లూపీ సామర్థ్యంతో  సోలార్ ప్లాంట్ ఏర్పాటుచేశారు. టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్, కార్ పార్కింగ్, అలైడ్ సిటీ సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉంది. రద్దీ సమయాల్లో 600 మంది ప్రయాణీకులకు, ఏటా 10 లక్షల మంది ప్యాసింజర్లకు సేవలు అందించేలా రెడీ చేశారు.  

అయోధ్య చరిత్ర,ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాన్ని కట్టారు. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం దాదాపు అయోధ్య రామ మందిరాన్ని పోలి ఉంటుంది. టెర్మినల్ లోపల శ్రీరాముని జీవితాన్ని వర్ణించే కళాఖండాలు, పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో  అలంకరించారు. ఫేజ్ 2 కింద, 50 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో  
కొత్త టెర్మినల్ భవనం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇది రద్దీ సమయాల్లో 4 వేల మంది ప్రయాణికులకు, ఏటా 60 లక్షల మంది ప్యాసింజర్లుకు సేవలను అందించనుంది.