IPL 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని భారత్ గెలిచింది. ఈ మెగా టోర్నమెంట్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ టోర్నీపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన ఇద్దరు స్టార్ ప్లేయర్స్ పేర్లు చెప్పాడు.
ఆరెంజ్ క్యాప్ సంజు శాంసన్‌దే:
ఈ ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు సంజు శాంసన్ కే ఎక్కువగా ఉన్నాయని ఆకాశ్ చోప్రా చెప్పారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరిన సంజు మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్‌లో శాంసన్ అద్భుతంగా రాణించి ఐదు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేశాడు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా లభించింది.
పర్పుల్ క్యాప్ బుమ్రాకే?:
బౌలింగ్ విభాగంలో పర్పుల్ క్యాప్ గెలుచుకునే అవకాశాలు జస్ప్రీత్ బుమ్రాకు ఉన్నాయని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న బుమ్రా టీ20 వరల్డ్ కప్‌లో కూడా సూపర్ గా రాణించాడు. టోర్నమెంట్లో మొత్తం 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను కట్టడి చేశాడు.
ఎమర్జింగ్ ప్లేయర్‌గా సూర్యవంశీ:
ఇక ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డును వైభవ్ సూర్యవంశీ గెలుచుకునే ఛాన్స్ ఉందని చోప్రా పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్ ఇటీవల జరిగిన అండర్–-19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
ప్లేఆఫ్‌కు చేరే నాలుగు టీమ్స్ ఇవే:
ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్‌కు చేరే నాలుగు జట్లులో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులను ఆకాశ్ చోప్రా ఎంపిక చేసుకున్నాడు. అంతేకాకుండా ఈసారి టైటిల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుచుకునే ఛాన్స్ ఉందని కూడా ఆయన అంచనా వేశారు.
